మొదట్లోనే మునిగింది..!!
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ ను ఎదుర్కొంటోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కొద్దిసేపటి కిందటే మ్యాచ్ ఆరంభమైంది. గాయం కారణంగా పాట్ కమిన్స్ ఈ మ్యాచ్ కు కూడా దూరం అయ్యాడు. డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ సారథ్యంలో సన్ రైజర్స్.. సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ పై వెరీ బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉంది సన్ రైజర్స్ కు.
టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. జట్టు స్కోర్ ఎనిమిది పరుగులకే ఓపెనర్లు పెవిలియన్ దారి పట్టారు. ఈ రెండు వికెట్లు కూడా మహ్మద్ షమీ తీసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.

తొలి ఓవర్ చివరి బంతికి అభిషేక్ ను అవుట్ చేశాడు షమీ. స్లిప్‌ను తొలగించినా, షార్ట్ థర్డ్‌లో ఉన్న సిద్ధార్థ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అభిషేక్ బ్యాట్ అంచుకు తగిలి గాల్లోకి ఎగిరిన బంతిని అతను కుడి వైపునకు డైవ్ చేసి అందుకున్నాడు. షమీ నుంచి వెలువడిన ఓ స్లోయర్ డెలివరీ అది. ఆఫ్ స్టంప్ అవతల పడిన ఫుల్ డెలివరీని డ్రైవ్ చేయబోయి టైమింగ్ మిస్ అయ్యాడు అభిషేక్. షార్ట్ థర్డ్ వైపు దూసుకెళ్లిన బంతిని సిద్ధార్థ్ ఒడిసి పట్టాడు.
మూడో ఓవర్ తొలి బంతికి ట్రావిస్ హెడ్ వికెట్ పడింది. షమీ 121 కి.మీ వేగంతో ఆఫ్ స్టంప్‌పై సంధించిన షార్ట్ ఆఫ్ లెంగ్త్, క్రాస్ యాంగిల్, స్క్రంబుల్డ్ సీమ్‌తో డెలివరీని హెడ్ కట్ షాట్ ఆడబోయాడు. బ్యాట్ ను ముద్దాడి బంతి మిడ్ ఆఫ్‌లో గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న మార్క్ రమ్ అద్భుతంగా ముందుకు డైవ్ చేసి దాన్ని అందుకున్నాడు.
నాలుగో ఓవర్ లో మరో వికెట్ పడింది. ప్రిన్స్ యాదవ్ వేసిన ఓవర్ అది. అతను సంధించిన బంతికి ఇషాన్ కిషన్ బలి అయ్యాడు. ఆ డెలివరీ ఇషాన్ కిషన్ ఆఫ్ స్టంప్‌ను గాలిలోకి లేపింది. ఆఫ్ స్టంప్ పై పిచ్ అయిన బంతిని కిషన్ డ్రైవ్ షాట్‌కు యత్నించగా, బంతి అనూహ్యంగా లోపలికి దూసుకువచ్చి అతని ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో జట్టు స్కోరు 11 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయింది సన్ రైజర్స్. ప్రస్తుతం లియామ్ లివింగ్ స్టన్, హెన్రిచ్ క్లాసెన్ క్రీజ్ లో ఉన్నారు.












Click it and Unblock the Notifications