Asia Cup: ఆసియా కప్ ట్రోఫీ పై మరో ట్విస్ట్- నక్వీ తాజా కండిషన్స్..!
ఆసియాకప్ ను గెల్చుకున్న భారత్ కు ట్రోఫీ ఇప్పట్లో అందేలా కనిపించడం లేదు. తాము గెల్చుకున్న ఆసియా కప్ ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్ అయిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్ మొహసిన్ నక్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు టీమిండియా గత నెలలో నిరాకరించింది. దీంతో ఆ ట్రోఫీని అలాగే పట్టుకుని పోయి యూఏఈ క్రికెట్ బోర్డు వద్ద ఉంచిన నక్వీకి.. తాజాగా బీసీసీఐ ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. ట్రోఫీ ఇవ్వకపోతే ఐసీసీ వద్దే తేల్చుకుంటామని ప్రకటించింది. దీనిపై ఆయన స్పందించాడు.
ఆసియా క్రికెట్ కప్ ట్రోఫీ తమకు అప్పగించాలంటూ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా పంపిన ఈ మెయిల్ కు ఏసీసీ ఛీఫ్ మొహసిన్ నక్వీ స్పందిస్తూ మరో మెయిల్ పంపాడు. అయితే ఇందులో ఆయన భారత్ కు ఆసియా కప్ అప్పగించేందుకు మరిన్ని షరతులు పెట్టాడు. బీసీసీఐ ఆఫీస్ బేరర్ తో పాటు ఫైనల్ మ్యాచ్ లో ఆడిన ఓ టీమ్ సభ్యుడు వచ్చి తీసుకోవాలని, దానికి కూడా ఓ కార్యక్రమం ఏర్పాటు చేయాలని షరతులు పెట్టాడు. దీనిపై బీసీసీఐ మండిపడుతోంది.

ఆసియా కప్ ట్రోఫీ కావాలంటే అందుకు ఓ బహుమతి ప్రదానం కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఇందులో ట్రోఫీతో పాటు భారత క్రికెటర్లు గెల్చుకున్న మెడల్స్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని నక్వీ తేల్చిచెప్పేశాడు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధికారులతో పాటు అందుబాటులో ఉన్న టీమిండియా క్రికెటర్లు కూడా రావాలని సూచించాడు. ఎలాగో ఈ కార్యక్రమాన్ని అభిమానులు కూడా స్వాగతిస్తారని, క్రికెట్ సంప్రదాయాల్ని, గౌరవాన్ని నిలబెట్టినట్లు అవుతుందని నక్వీ సలహాలు ఇచ్చాడు.

నక్వీ స్పందనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీసీసీఐ.. త్వరలో జరిగే ఐసీసీ సమావేశంలోనే దీనిపై తేల్చుకుంటామని చెబుతోంది. ఆసియా కప్ ట్రోఫీ గెల్చుకుని నెల రోజులు కావస్తున్నా ఇంకా తమకు అప్పగించకుండా దాన్ని వచ్చి తీసుకోవాలని నక్వీ షరతులు పెడుతుండటం భారత క్రికెట్ అభిమానుల్ని కూడా తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. నక్వీ పదవి నుంచి తప్పుకునే వరకూ ఆసియా కప్ ను బీసీసీఐ తీసుకోవద్దని అభిమానులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications