రోహిత్ సేన ముందు..లంక కుప్పిగంతులు: సిరాజ్ మేజిక్ స్పెల్
కొలంబో: ఆసియా కప్ 2023 టోర్నమెంట్ ఫైనల్‌లో భారత్ చెలరేగుతోంది. శ్రీలంక జట్టుకు సొంత గడ్డపై చుక్కలు చూపిస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం అనే నిర్ణయం ఎంత పొరపాటో ఆ జట్టు కేప్టెన్‌కు తెలిసి వచ్చేలా చేసింది. టీమిండియా బౌలర్ల పరాక్రమం చూస్తోంటే 100 పరుగుల చేయడం కూడా లంకేయులకు గగనమే.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆసియా కప్ ఫైనల్స్‌లో టాస్ గెలిచింది శ్రీలంక. మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు ఆ జట్టు కేప్టెన్ డాసన్ శనక. ఈ నిర్ణయంతోనే సగం మ్యాచ్ ఓడిపోయినట్టయింది. ఛేజింగ్ అంటే చెలరేగిపోయే గుణం ఉంది భారత బ్యాటర్లకు. కొండంత లక్ష్యాన్నయినా ఊది పడేస్తారు.

అలాంటి జట్టుకు ముందు కుప్పిగంతులు వేసే ప్రయత్నం చేసింది లంక. సూపర్ 4లో పాకిస్తాన్‌ను ఓడించామనే ఆత్మవిశ్వాసం కాస్తా అతి విశ్వాసంగా మారినట్టు కనిపించింది. అది కాస్తా బెడిసికొట్టింది. బౌలర్ల అరివీర భయంకర ప్రతాపం ముందు తల వంచింది. 20 పరుగుల్లోపే ఆరు వికెట్లను కోల్పోయింది.
తొలి ఓవర్ నుంచే లంక పతనం ఆరంభమైంది. తొలి ఓవర్ మూడో బంతికి ఓపెనర్ కుశాల్ పెరీరా అవుట్ అయ్యాడు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాతి వంతు మహ్మద్ సిరాజ్‌ది. ఒకే ఓవర్‌లో అంటే ఆరు బంతుల్లో నలుగురు లంక బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించాడు.

ఇన్నింగ్ నాలుగో ఓవర్ తొలి బంతికి మరో ఓపెనర్ పాథుమ్ నిశ్శంకను బలి తీసుకున్నాడు సిరాజ్. మూడో బంతికి సదీర సమరవిక్రమ ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో బంతికి స్టార్ బ్యాటర్ అసలంక డకౌట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ మీద పడ్డ ఫుల్లర్‌ను షాట్ ఆడబోయి కవర్స్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్ ఆరోబంతికి ధనంజయ డిసిల్వను అవుట్ చేశాడు.
ఆ తరువాత కూడా సిరాజ్ విశ్వరూపం ఆగలేదు. ఇన్నింగ్ ఆరో ఓవర్ నాలుగో బంతికి డాసన్ శనక వికెట్లను నేలకూల్చాడు. సిరాజ్ వేసిన ఫుల్లర్‌ను అర్థం చేసుకోలేకపోయాడు శనక. ఆడాలా? వద్దా? అంటూ తికమకపడ్డాడు. బ్యాట్ అడ్డు పెట్టడం ఆలస్యం చేశాడు. ఆఫ్ స్టంప్‌ను గాల్లోకి ఎగరగొట్టిందా బంతి. 12 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది లంక.












Click it and Unblock the Notifications