ఆస్ట్రేలియాను మట్టికరిపించిన ఆఫ్ఘనిస్తాన్
AUS vs AFG: టీ20 వరల్డ్ కప్ 2024లో మరో పెను సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. సూపర్ 8లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. 21 పరుగుల తేడాతో జయకేతనాన్ని ఎగురవేసింది. తన సెమీ ఫైనల్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది.
వెస్టిండీస్‌లోని సెయింట్ విన్సెంట్‌లోని కింగ్స్‌టౌన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. కుప్పకూలింది. 127 పరుగుల వద్దే చాప చుట్టేసింది.

ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రహ్మనుల్లా గుర్బాజ్- 60, ఇబ్రహీం జడ్రాన్- 51 పరుగులు చేశారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 118 పరుగులు జోడించారు. వారిద్దరూ అవుట్ అయిన తరువాత వచ్చిన బౌలర్లు ఎవరూ క్రీజ్‌లో నిలదొక్కుకోలేదు. అజ్మదుల్లా ఓమర్జాయ్- 2, కరీం జనత్- 13, కేప్టన్ రషీద్ ఖాన్- 2, గుల్బదీన్ నబీ- 0, మహ్మద్ నబీ- 2, (నాటౌట్), నంగేయాలియా ఖరొటే- 1 (నాటౌట్) పరుగులు చేశారు.
బౌలర్లల్లో పాట్ కమ్మిన్స్- 3, ఆడమ్ జంపా- 2, మార్కస్ స్టొయినిస్- 1 వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా పాట్ కమ్మిన్స్ దుమ్ము లేపాడు. హ్యాట్రిక్‌తో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపాడు. 18వ ఓవర్ ఆరో బంతి, 20వ ఓవర్ తొలి రెండు బంతులకు వరుస వికెట్లు నేలకూల్చాడు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో రెండు హ్యాట్రిక్ అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా గమ్యాన్ని అందుకోలేపోయింది. 127 పరుగుల వద్ద చతికిలపడింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల స్పిన్ మాయాజాలంలో చిక్కుకుని ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడారు. పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 41 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 59 పరుగులు కొట్టాడు.
ట్రావిస్ హెడ్ డకౌట్‌తో ఆసీస్ ఇన్నింగ్ ఆరంభమైంది. ఆ తరువాత ఎక్కడే గానీ వికెట్ల పతనానికి అడ్డుకట్ట పడలేదు. డేవిడ్ వార్నర్- 3, కేప్టెన్ మిఛెల్ మార్ష్- 12, మార్కస్ స్టొయినిస్- 11, టిమ్ డేవిడ్- 2, మాథ్యూ వేడ్- 5, పాట్ కమ్మిన్స్- 3, అష్టర్ అగర్- 2, ఆడం జంపా- 9 పరుగులు చేశారు. జోష్ హేజిల్‌వుడ్- 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లల్లో గుల్బదీన్ నబీ నాలుగు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్, పాట్ కమ్మిన్స్ వికెట్లు పడగొట్టాడు. నవీనుల్ హక్ వికెట్లతో చెలరేగాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ ఒక్కో వికెట్ తీసుకున్నారు.












Click it and Unblock the Notifications