IPL 2026: 25 కోట్ల ఆల్ రౌండర్ పై కేకేఆర్ వర్సెస్ ఆస్ట్రేలియా..! తేల్చేసిన హెడ్ కోచ్..!
ఐపీఎల్ 2026 (ipl 2026)లో అత్యధిక రేటు 25.20 కోట్లకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఇప్పుడు కోల్ కతా నైట్ రైడర్స్ కు పనికిరాకుండా పోతున్నాడు. భారీ అంచనాలతో కొనుక్కున్న ఈ ఆటగాడు..తన గాయాన్ని కారణంగా చూపుతూ బౌలింగ్ చేసేందుకు ఇష్టపడటం లేదు. క్రికెట్ ఆస్ట్రేలియా సూచనలతోనే అతను ఇలా బౌలింగ్ చేయకుండా తప్పించుకుంటున్నాడని భావిస్తున్న కేకేఆర్ కెప్టెన్ ఆజింక్య రహానే బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఇరుకునపడింది.
ముంబై ఇండియన్స్ తో ఆడిన తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 220 పరుగులు చేసినా బౌలింగ్ పసలేక ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron green)ను బౌలింగ్ కు దించలేదు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మ్యాచ్ తర్వాత కెప్టెన్ ఆజింక్య రహానే స్పందించాడు. గ్రీన్ తో ఎందుకు బౌలింగ్ చేయించలేదన్న ప్రశ్న అడిగితే క్రికెట్ ఆస్ట్రేలియానే అడగమని సూచించాడు.

దీంతో ఇరుకునపడిన క్రికెట్ ఆస్ట్రేలియా.. గ్రీన్ కు వెన్నునొప్పి ఉందని, అందుకే బౌలింగ్ కు దూరంగా ఉండాలని సూచించినట్లు వెల్లడించింది. అలాగే గ్రీన్ గాయం విషయం కేకేఆర్ కు ముందుగానే చెప్పినట్లు కూడా తెలిపింది. 10-12 రోజుల పాటు అతను బౌలింగ్ చేయలేడని చెప్పేసింది. అయినా విమర్శల జడి ఆగలేదు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్టేలియా తమ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ తో వివరణ ఇప్పించింది. ఐపీఎల్‌లోనూ, ఆస్ట్రేలియా క్రికెట్ లోనూ కామెరాన్ గ్రీన్ భారీ అంచనాలను ఎదుర్కొంటున్నాడని, కానీ అతని కెరీర్ ఉన్నత స్థాయిలో ఉందని, వాటన్నింటినీ సమతుల్యం చేసుకునే సత్తా ఆ ఆల్‌రౌండర్‌కు ఉందని ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అన్నారు.

ఐపీఎల్‌లో భారీ అంచనాలు ఉన్నాయని, అలాగే ఆస్ట్రేలియా జట్టును తీర్చిదిద్దే ఏ ఆల్‌రౌండర్‌పైనైనా భారీ అంచనాలు ఉంటాయని, ఇది అన్యాయం కాదని తెలిపాడు. కానీ ఆల్‌రౌండర్లు ఏదో ఒక విధంగా జట్టుకు తమ వంతు సహకారం అందించాలనే అంచనాలు ఉంటాయన్నాడు. బ్యాటింగ్‌లో 45 సగటు, బౌలింగ్‌లో 30 కంటే తక్కువ సగటు సాధించాలని వాళ్లు కోరుకుంటున్నట్లుంది, అలా చేసిన వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారని కోచ్ తెలిపాడు. అతను సమర్థుడని మాకు తెలుసు, అయితే అంచనాలను బ్యాలెన్స్ చేసుకోవాలని గ్రీన్ కు సలహా ఇచ్చాడు.












Click it and Unblock the Notifications