రొనాల్డో.. అదేం మేజిక్ రా అయ్యా: ఇంజ్యూరీ టైమ్ చిట్టచివరి నిమిషంలో.. !!
ఫిఫా వరల్డ్ కప్ లో పోర్చుగల్ అద్భుతాన్ని సాధించింది. నాకౌట్స్ లో పెనాల్టీ షూటౌట్స్ వరకూ వెళ్లాల్సిన మ్యాచ్ లో చివరి నిమిషంలో కాపాడుకోగలింది. క్రొయేషియాను మట్టికరిపించింది. టొరంటో స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య సాగిన ఈ రసవత్తర పోరు చివరి నిమిషం వరకు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో, యువ సంచలనం గొన్సాలో రామోస్ అద్భుతమైన గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో రౌండ్ ఆఫ్ 16లో ప్రవేశించింది పోర్చుగల్.
ప్రథమార్థంలో రెండు జట్లూ కొదమసింహాల్లా పోరాడాయి. రెండు జట్లు అనుసరించిన డిఫెన్స్ వ్యూహాలు ప్లేయర్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఫలితంగా ఒక్క గోల్ కూడా నమోదుకాలేదు. ఎక్కువ సేపు బంతిని తమ ఆధీనంలో ఉంచుకుంటూ పోర్చుగల్ కొంత ఆధిపత్యం ప్రదర్శించింది గానీ గోల్ సాధ్యం కాలేదు. బ్రూనో ఫెర్నాండెజ్, రఫెల్ లియావో సృష్టించిన అవకాశాలను క్రొయేషియా గోల్ కీపర్ డొమినిక్ లివకోవిచ్ చాకచక్యంగా అడ్డుకున్నాడు.

రొనాల్డో ఫ్రీ కిక్ కొట్టినప్పటికీ అది ప్రత్యర్థి డిఫెన్స్ ను దాటలేకపోయింది. క్రొయేషియా డిఫెండర్లు పోర్చుగల్ దాడులను సమర్థవంతంగా అడ్డుకుంటూ మొదటి సగం ముగిసే వరకు స్కోరును 0-0 వద్ద నిలిపారు. ద్వితీయార్ధంలో క్రొయేషియా వ్యూహం మార్చింది. 46వ నిమిషంలో యాంటే బుడిమిర్ స్థానంలో ఇగోర్ మాతానోవిచ్‌ను మైదానంలోకి దించింది. ఆ కొద్దిసేపటికే లీడ్ సాధించింది. మ్యాచ్ 53వ నిమిషంలో జోసిప్ స్టానిసిచ్ ఇచ్చిన క్రాస్‌ను ఇవాన్ పెరిసిచ్ గోల్‌గా మలిచి క్రొయేషియాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
దీంతో ఆ జట్టు క్యాంప్ లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. ఆ వెంటనే క్రొయేషియా మరో గోల్ సాధించినట్లు కనిపించినా, ఆఫ్ సైడ్ కారణంగా అది రద్దయింది. ఈ గోల్ పోర్చుగల్ ను ఒత్తిడిలోకి నెట్టింది. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందలేదు పోర్చుగల్. ఈ దశలో ఈ జట్టు కోచ్ మరింత దూకుడుగా వ్యవహరించారు. ఆట 62, 63వ నిమిషాల వ్యవధిలో జట్టులో ఏకంగా అయిదు కీలక మార్పులు చేశారు. బెర్నార్డో సిల్వా స్థానంలో విటిన్హా, ఫ్రాన్సిస్కో కాన్సికావో స్థానంలో పెడ్రో నెటో ప్రవేశించారు.
వీరితో పాటు నెల్సన్ సెమెడో, బ్రూనో ఫెర్నాండెజ్ కూడా మైదానంలోకి దిగారు. చివరిగా గొంసాలో రామోస్‌ను జోవాల్ కాన్సెలో స్థానంలోకి తీసుకురావడంతో పోర్చుగల్ ఆటతీరులో వేగం సంతరించుకుంది. ఈ క్రమంలో 68వ నిమిషంలో పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో లభించిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. క్రొయేషియా ఆటగాడు నికోలా వ్లాసిచ్ డిఫెన్స్‌లో తప్పు చేయడంతో పోర్చుగల్‌కు పెనాల్టీ లభించింది. దీనిని రొనాల్డో అవకాశంగా మలచుకున్నాడు. మెరుపు వేగంతో దూసుకెళ్లి క్రొయేషియా గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ గోల్ సాధించాడు. దీంతో స్కోరు 1-1 తో సమమైంది.
రొనాల్డో సాధించిన ఈ గోల్‌తో టొరంటో స్టేడియంలోని అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఆ తర్వాత 81వ నిమిషంలో కోచ్ రొనాల్డోకు విశ్రాంతికై వెనక్కి పిలిచి, రుబెన్ నెవెస్ ను రంగంలోకి దించారు. రొనాల్డో మైదానం వీడిన తర్వాత కూడా మ్యాచ్ తీవ్రత ఎంతమాత్రం తగ్గలేదు. రెండు జట్లు కూడా విజయం సాధించడమే లక్ష్యంగా చివరి నిమిషం వరకు గట్టిగా పోరాడాయి. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసినా ఫలితం తేలకపోవడంతో ఈ మ్యాచ్ ఇంజురీ టైమ్ లోకి ప్రవేశించింది.
సరిగ్గా 90+4వ నిమిషంలో పోర్చుగల్ జట్టుకు గోల్ సాధించే అద్భుత అవకాశం లభించింది. రాఫెల్ లియావో నుండి లభించిన అద్భుతమైన అసిస్ట్‌ను గొంసాలో రామోస్ అత్యంత చాకచక్యంగా గోల్‌గా మలిచాడు. ఈ సంచలన గోల్‌తో పోర్చుగల్ ఒక్కసారిగా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో స్టేడియంలో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. చివరి సెకన్లలో క్రొయేషియా దాడి చేసినా పోర్చుగల్ డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకోవడంతో విజయం ఖాయమైంది.












Click it and Unblock the Notifications