India playing 11: సమవుజ్జీతో పోరు: బర్త్‌డే బాయ్ కోహ్లీ: స్పాట్‌లైట్ వారిపైనే..
కోల్‌కత: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా.. నేడు మరో మ్యాచ్ ఆడబోతోంది. వరుసగా ఏడు విజయాలతో ఇప్పటికే సెమీ ఫైనల్స్ బెర్త్ ఖరారయిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో షెడ్యూల్ అయిందీ గేమ్.
ఇప్పటికే రెండు జట్లూ కోల్‌కతకు చేరుకున్నాయి. నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడుస్తోన్నాయి. అటు దక్షిణాఫ్రికా సైతం ఊపు మీద ఉంది. ఓ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. ఎలాంటి ప్రభావం పడలేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లల్లో ఆరింట్లో గెలిచింది. అవన్నీ హై-స్కోర్ మ్యాచ్‌లే. ఓపెనర్ క్వింటన్ డికాక్ సహా వాన్ డెర్ డస్సెన్, బ్యాటర్లు ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్.. ఇలా జట్టు మొత్తం ఫుల్ ఫామ్‌లో ఉంది.

భారత్ తరువాత సెమీ ఫైనల్స్ చేరిన రెండో జట్టు దక్షిణాఫ్రికే. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను పాకిస్తాన్ ఓడించడంతో దక్షిణాఫ్రికా లబ్ది పొందింది. మిగిలిన మ్యాచ్‌లల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా ఆ జట్టు సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఇంకో రెండు బెర్త్‌లో మిగిలివున్నాయి. ఓ బెర్త్ ఆస్ట్రేలియాకు దాదాపుగా ఖాయమైనట్టే.
భారత జట్టులో పెద్దగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం లేదు. ఇప్పుడున్న జట్టునే దక్షిణాఫ్రికాపై ఆడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రయోగాల జోలికి వెళ్లదలచుకోలేదు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టోర్నమెంట్ నుంచి తప్పుకొన్న నేపథ్యంలో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణను ఈ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం లేదు.
ఈ మ్యాచ్‌లో స్పాట్ లైట్ క్వింటన్ డికాక్, మహ్మద్ షమీపై పడింది. వారిద్దరి మధ్య పోరు ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే తన పేరు మీద నాలుగు సెంచరీలను లిఖించుకున్నాడు క్వింటన్ డికాక్. తన కేరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తోన్నాడు ఈ లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్.
అటు షమీ కూడా అంతే. లేట్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. దుమ్ము లేపుతున్నాడు. రెండు సార్లు అయిదు వికెట్లు పడగొట్టాడు. నిప్పు కణికల్లాంటి బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తోన్నాడు. డికాక్ స్పీడుకు షమీ ఎలా బ్రేకులు వేస్తాడా? లేదా? అనేది ఈ మ్యాచ్‌తో తేలిపోనుంది.
భారత్ తుదిజట్టులో- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఆడొచ్చు. దక్షిణాఫ్రికాలో- క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డుస్సెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జన్‌సెన్, కగిసో రబడ, కేశవ్ మహారాజ్, లుంగీ ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ/జెరాల్డ్ కోయెట్జీ ఆడే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications