డేటింగ్ యాప్‌లో చాహల్?: సంచలన విషయాలు బయటపెట్టిన స్టార్ స్పిన్నర్!
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గత కొంతకాలంగా తన వ్యక్తిగతం జీవితంపై వస్తున్న వార్తలపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు, ఆ తర్వాత తలెత్తిన పరిణామాల గురించి ఆయన మనసు విప్పారు. ఈ క్లిష్ట సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి కారణంగానే కొన్ని కీలక క్రికెట్ టోర్నీలకు దూరం కావాల్సి వచ్చిందని యుజ్వేంద్ర చాహల్ వెల్లడించారు.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
విడాకుల ప్రక్రియ జరుగుతున్న సమయంలో తన మానసిక స్థితి ఏ మాత్రం బాగోలేదని యుజ్వేంద్ర చాహల్ అంగీకరించారు."బయటకు అంతా సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, లోపల ఉన్న ఒత్తిడి నా ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఆ సమయంలో నా మెదడు సరైన స్థితిలో లేదు, అందుకే గతేడాది జరిగిన కొన్ని ముఖ్యమైన టోర్నమెంట్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను" అని యుజ్వేంద్ర చాహల్ వివరించారు. మానసిక పోరాటం అనేది ఎప్పుడూ వైఫల్యంలా కనిపించదని, కొన్నిసార్లు అది మౌనం, దూరంగా ఉండటం రూపంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఎమోషనల్ క్లోజర్ తర్వాతే ముందడుగు
విడాకులు తన జీవితంలో ఒక అధ్యాయమని, దానిని మానసిక పరంగా మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు యుజ్వేంద్ర చాహల్ వెల్లడించారు. "చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎమోషనల్ క్లోజర్ లభించింది. సోషల్ మీడియాలో ఎన్ని ఊహాగానాలు వచ్చినా, నేను ఆ గతం దగ్గరే ఆగిపోలేదు. ఇప్పుడు మేమిద్దరం మా మా జీవితాల్లో సంతోషంగా ఉన్నాం" అని ఆయన స్పష్టం చేశారు. పాత బంధాన్ని పట్టుకుని వేలాడటం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రోలింగ్‌పై చాహల్ స్పందన
విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఎదురైన విమర్శలపై కూడా యుజ్వేంద్ర చాహల్ స్పందించారు. తన పేరును కొంతమంది మహిళా స్నేహితులతో ముడిపెట్టి ట్రోల్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. "నా పేరు ఎవరితోనైతే వినిపించిందో వారు కేవలం నా స్నేహితులు మాత్రమే. నేను కొంతకాలం డేటింగ్ యాప్‌ను ప్రయత్నించాను, కానీ అది నాకు అర్థం కాక డిలీట్ చేసేశాను" అని ఆయన వెల్లడించారు. ఆన్‌లైన్ నెగటివిటీ గురించి మాట్లాడుతూ.. ప్రజలు ఎంత ప్రేమిస్తారో, అంతే స్థాయిలో ద్వేషిస్తారని, కానీ ఇప్పుడు ఆ విషయాలు తనపై పెద్దగా ప్రభావం చూపడం లేదని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications