టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఒక బెర్త్ కన్ఫర్మ్: రేసు రసవత్తరం
టీ20 వరల్డ్ కప్ లో సైలెంట్ గా దూసుకెళ్తోంది ఇంగ్లాండ్. తొలుత లీగ్స్ లో, ఇప్పుడు సూపర్ 8 లో ఛాంపియన్ ఆటతీరును ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. తాజాగా పాకిస్తాన్ ను మట్టికరిపించింది. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో అడుగు పెట్టింది. తన బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి జట్టు ఇదే. ఇక మిగిలిన మూడు బెర్తుల కోసం ఏడు జట్లు పోటీ పడాల్సి ఉంది.. భారత్ సహా.
మంగళవారం రాత్రి శ్రీలంక పల్లెకెలో పాకిస్తాన్ తో జరిగిన ఈ మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇంగ్లాండ్. సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ కు దిగి.. తొమ్మిది వికెట్ల నష్టానికి 164 పరుగుల చేసింది. దీన్ని 19.1 ఓవర్లల్లో అందుకుంది ఇంగ్లాండ్. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసక శతకం ఆ జట్టు విజయానికి బాటలు వేసింది. అతను ఈ సెంచరీ చేయకపోయివుంటే ఇంగ్లాండ్ ఓడిపోయేదే.

తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ ను కోల్పోయింది ఇంగ్లాండ్. షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ అవుట్ అయ్యాడు. 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిందంటే పాకిస్తాన్ బౌలింగ్ పదును ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడవ ఓవర్‌లో బట్లర్ కూడా వెనుదిరిగాడు. హ్యారీ బ్రూక్ కాకుండా మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు. ఫిల్ సాల్ట్-0, బట్లర్-2, జాక్ బెథెల్- 8, టామ్ బాంటన్- 2.. ఇలా సాగింది వారి బ్యాటింగ్. సామ్ కర్రన్- 16, విల్ జాక్స్- 28 పరుగులు చేశారు.
ఈ గడ్డు పరిస్థితుల్లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అతను కేవలం 28 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని, ఒంటరి పోరాటం కొనసాగించాడు. 50 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అతను ఔటయ్యాడు. అప్పటికి ఇంగ్లాండ్ విజయానికి 18 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే అవసరం. ఆ తర్వాతి ఓవర్‌లో మహ్మద్ నవాజ్ రెండు కీలక వికెట్లు తీయడంతో పాకిస్తాన్ మళ్లీ మ్యాచ్‌లోకి దూసుకొచ్చింది.
చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్‌కు మూడు పరుగులు, పాకిస్తాన్‌కు రెండు వికెట్లు అవసరమయ్యాయి. సల్మాన్ మిర్జా వేసిన తొలి బంతికి జోఫ్రా ఆర్చర్ ఫోర్ కొట్టి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో గ్రూప్ 2 నుండి సెమీ ఫైనల్స్ చేరిన తొలి జట్టయింది ఇంగ్లాండ్. న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. వరుసగా న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.












Click it and Unblock the Notifications