SA vs SL : లంకను ఉతికారేసిన దక్షిణాఫ్రికా-ముగ్గురు సెంచరీలు-429 పరుగుల భారీ టార్గెట్..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంక ముందు 429 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. పలు రికార్డుల్ని అలవోకగా చెరిపేస్తూ దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చెలరేగి పోవడంతో పరుగులు సునాయాసంగా వచ్చాయి. పేలవమైన లంక బౌలింగ్ లో వరుస బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిన ప్రొటీజ్ బ్యాట్స్ మెన్ .. ఏకంగా 429 పరుగులు సాధించారు. ఇందులో ముగ్గురు సెంచరీలు కొట్టారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంకను ఆరంభం నుంచీ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ఊచకోత కోశారు. లంకేయుల పేలవ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ చెలరేగిపోయారు. 10 పరుగులకే ఓపెనర్ టెంబా బవుమా వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికాకు ఆ తర్వాత ఎదురే లేకుండా పోయింది. వన్ డౌన్ లో వచ్చిన రస్సీ వాండర్ డస్సెన్ తో కలిసి ఓపెనర్ క్వింటన్ డీకాక్ పరుగుల వరద పారించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో తొలుత డీకాక్ 84 బంతుల్లోనే 12 ఫోర్లు 3 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకుని ఔట్ కాగా.. తర్వాత వాండర్ డస్సెన్ కూడా 110 బంతుల్లో 2 సిక్సర్లు, 13 ఫోర్ల సాయంతో 108 పరుగులు చేసి అవుటయ్యాడు.

వీరిద్దరూ వరుసగా ఔట్ కావడంతో మార్ క్రమ్, క్లాసెన్ తో కలిసి వేగంగా పరుగులు రాబట్టాడు. మొదట్లో వరుసగా బౌండరీలు బాదిన మార్ క్రమ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మరింత రెచ్చిపోయాడు. కేవలం 49 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు. దీంతో వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదైంది. మార్ క్రమ్ సెంచరీ తర్వాత అవుట్ కావడం, క్లాసెన్ కూడా 32 పరుగులకే వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా 350 పరుగులు చేసేలా కనిపించింది. కానీ ఆ తర్వాత రంగంలోకి దిగిన మిల్లర్ రెచ్చిపోయాడు.
మార్ క్రమ్- మిల్లర్ జోడీ వేగంగా పరుగులు రాబడుతున్న తరుణంలో సెంచరీ పూర్తి చేసుకున్న మార్ క్రమ్ అవుటయ్యాడు. దీంతో చివర్లో జన్సెన్ సాయంతో మిల్లర్ బౌండరీలు కొడుతూ దక్షిణాఫ్రికా స్కోరు 400 పరుగులు దాటించేశాడు. చివరి ఓవర్లలో ఈ జోడీ మరింత రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. దీంతో వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే దక్షిణాఫ్రికా టాప్ స్కోరు నమోదుచేసింది. దీంతో పాటు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ఇలా ఒకే మ్యాచ్ లో మూడు సెంచరీలు కొట్టడం కూడా ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications