రవీంద్ర జడేజా అవుట్: వైజాగ్ టెస్ట్ మ్యాచ్‌కు దూరం
Ravinda Jadeja: ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను దారుణంగా ఆరంభించింది టీమిండియా. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్‌లో ఘోరంగా ఓడిపోయింది. ఇంకో రోజు ఆట మిగిలి వుండగానే పరాజయాన్ని చవి చూసింది. 0-1 తేడాతో వెనుకంజ వేసింది.
తొలి ఇన్నింగ్‌లో భారీ స్కోర్ సాధించి.. పట్టు బిగించినప్పటికీ.. దాన్ని విజయంగా మలుచుకోవడంలో విఫలమైంది భారత్. తొలి ఇన్నింగ్‌లో 436 పరుగులు చేసి, భారీ ఆధిక్యతను సాధించినా రెండో ఇన్నింగ్‌లో బ్యాటర్ల తడబాటు దెబ్బకొట్టింది. గెలవడానికి కావాల్సిన 230 పరుగులను కూడా అందుకోలేక చతికిలపడింది. 202 వద్దే ఆలౌట్ అయింది.

ఈ పరాజయ భారాన్ని దిగమింగుకుంటూ రెండో టెస్ట్ కోసం సన్నద్ధమౌతోంది. ఫిబ్రవరి 2వ తేదీన విశాఖపట్నంలో షెడ్యూల్ అయిందీ మ్యాచ్. మంగళవారం రెండు జట్లూ విశాఖకు చేరుకుంటాయి. నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటాయి. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇందులోనూ ఓడితే.. పుంజుకోవడం కష్టసాధ్యమే.
ఈ పరిస్థితుల్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదు. హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీతో అతను బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోనే అతనికి స్కానింగ్ చేశారు. గాయం తీవ్రతను బీసీసీఐ మెడికల్ టీమ్ అంచనా వేస్తోంది. స్కానింగ్ రిపోర్ట్ అందిన తరువాత రవీంద్ర జడేజా ఆడతాడా? లేదా? అనేది నిర్దారిస్తుంది.
రెండో ఇన్నింగ్‌లో అతను రెండు పరుగులకే రనౌట్ అయిన విషయం తెలిసిందే. జో రూట్ బౌలింగ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించినప్పుడు కాలి కండరాలు పట్టేశాయి. ఆ పరుగును పూర్తి చేయలేకపోయాడు. నొప్పితో విలవిల్లాడాడు. పెవిలియన్ దారి పట్టినప్పుడూ అతను డిస్ కంఫర్ట్‌గా కనిపించాడు.

హ్యామ్ స్ట్రింగ్ ఇంజ్యూరీగా మెడికల్ టీమ్ నిర్ధారించింది. బీసీసీఐ పరిశీలన కోసం దీన్ని ముంబైకి పంపించింది. ఈ మధ్యాహ్నానికి రిపోర్ట్ రావొచ్చు. తొలి ఇన్నింగ్‌లో అద్భుతంగా ఆడాడు జడేజా. 87 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 400 మార్క్‌ను దాటడంలో కీలకంగా వ్యవహరించాడు. రెండు ఇన్నింగుల్లో కలిపి అయిదు వికెట్లు పడగొట్టాడు.
రెండో టెస్ట్‌లోనూ విరాట్ కోహ్లీ ఆడట్లేదనే విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకూ అతను దూరం అయ్యాడు. ఇక రవీంద్ర జాడేజా కూడా అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారొచ్చు. జడేజా స్థానంలో రజత్ పటిదార్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications