టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కకావికలం- హైలైట్ అదే
IND vs NZ: భారత్‌పై బెంగళూరులో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించిన న్యూజిలాండ్ ఇప్పుడు కదనోత్సాహంలో ఉంది. రెండో టెస్ట్‌లోనూ విజయఢంకా మోగించడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరగ్గొట్టింది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తిరుగులేని విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను మట్టికరిపించింది. టీమిండియా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని కొట్టి పడేసింది. 36 సంవత్సరాల తరువాత భారత్‌లో భారత్‌పై టెస్ట్ మ్యాచ్ గెలవడం న్యూజిలాండ్‌కు ఇదే తొలిసారి.

ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ అదే తరహా రిజల్ట్ రాదనే గ్యారంటీ లేకుండా పోయింది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగారు. టీమిండియా బ్యాటర్ల భరతం పట్టారు. కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టారు.
రెండో రోజు తొలి సెషన్‌లోనే వరుసగా వికెట్లు పడ్డాయి. భోజన విరామ సమయానికి ఏకంగా ఏడు వికెట్లు కుప్పకూలాయి. 107 పరుగులకే టాప్, మిడిలార్డర్ బ్యాటర్లందరూ చాప చుట్టేశారు. పెవిలియన్‌లో వచ్చి కూర్చున్నారు.
భోజన విరామం అనంతరం టీమిండియా ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. 40 నిమిషాల్లో చివరి మూడు వికెట్లను కోల్పోయింది. 156 పరుగులకు ఆలౌట్ అయింది. 41 పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లు పడ్డాయి. వాషింగ్టన్ సుందర్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా 103 పరుగుల ఆధిక్యతలను సాధించింది న్యూజిలాండ్.
తొలి రోజు చివరి గంటలోనే భారత జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. రెండో రోజూ వికెట్ల పతనానికి ఎక్కడే గానీ బ్రేకులు పడలేదు. జట్టు స్కోరు 50 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. శుభ్‌మన్ గిల్- 30 పరుగులు చేసి మిఛెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుట్ అయ్యాడు.
అది మొదలు వికెట్లు టపటపమంటూ రాలిపోయాయి. యశస్వి జైస్వాల్- 30, విరాట్ కోహ్లీ- 1, రిషభ్ పంత్- 18, సర్ఫరాజ్ ఖాన్- 11, రవిచంద్రన్ అశ్విన్- 4, రవీంద్ర జడేజా- 38, ఆకాష్ దీప్- 6, జస్‌ప్రీత్ బుమ్రా డకౌట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లల్లో శాంట్నర్ చెలరేగాడు. స్పిన్ మాయాజాలంతో కట్టిపడేశాడు. ఏడు వికెట్లు నేల కూల్చాడు.
చివరి మూడు వికెట్లు కూడా అతని ఖాతాలోనే పడ్డాయి. అయిదు వికెట్లు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకోవడం శాంట్నర్‌కు ఇదే తొలిసారి. తన టెస్ట్ కేరీర్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్‌ను రికార్డ్ చేసుకున్నాడీ స్పిన్ బౌలర్. తొలి రోజున వాషింగ్టన్ సుందర్ 59 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టగా.. రెండో రోజున శాంట్నర్ 53 పరుగులకు ఏడు వికెట్లు కూల్చడం హైలైట్‌గా చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications