ఐపీఎల్ స్టార్స్.. మన విశాఖ బీచ్‌లో
DC vs CSK : ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్‌లో అప్పుడే 11 మ్యాచ్‌లు అయిపోయాయి. ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్ మినహా అన్ని జట్లు కూడా విజయాలను సాధించాయి. తమ ప్రత్యర్తులను ఓడించాయి. తమ ఖాతాలో పాయింట్లను పోగు చేసుకున్నాయి.
నేడు సూపర్ సండే. డబుల్ హెడ్డర్స్ షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్ టైటాన్స్‌తో తలపడబోతోంది. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. హోమ్ పిచ్‌పై గుజరాత్‌ను ఎదుర్కొనబోతోంది.

రెండో మ్యాచ్- ఈ సాయంత్రం 7:30 గంటలకు జరగబోతోంది. ఢిల్లీ కేపిటల్స్.. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టబోతోంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ- వీడీసీఏ స్టేడయం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ రెండు జట్లకూ ఇది మూడో మ్యాచ్.
ఇప్పటివరకు ఆడిన రెండింట్లోనూ తిరుగులేని విజయాలను సాధించింది సూపర్ కింగ్స్. నాలుగు పాయింట్లతో పాటు మెరుగైన నెట్ రన్‌రేట్‌తో టేబుల్ టాపర్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఛాంపియన్ తరహా ఆటతీరును ప్రదర్శిస్తోంది.
ఢిల్లీ కేపిటల్స్ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. ఇప్పటివరకు ఆడిన రెండింట్లోనూ ఓటమి పాలయింది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, అనంతరం రాజస్థాన్ రాయల్స్ చేతిలో మట్టికరిచింది. ఇక మూడో మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది? మూడో మ్యాచ్‌లో అయినా డీసీ బోణీ కొడుతుందా? లేదా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

ఢిల్లీ కేపిటల్స్‌కు విశాఖపట్నమే హోమ్ గ్రౌండ్. ఓ ఐపీఎల్ టీమ్ విశాఖను హోమ్ గ్రౌండ్‌గా మార్చుకోవడం ఇదే తొలిసారి. ఆరు సంవత్సరాల తరువాత విశాఖపట్నం ఐపీఎల్ కళను సంతరించుకుంది. మ్యాచ్‌కు రెండు రోజుల ముందే స్టీల్ సిటీకి చేరుకుందా జట్టు. ప్లేయర్లందరూ నెట్ ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు.
కాగా- నెట్ ప్రాక్టీస్‌లో చిన్న బ్రేక్ ఇచ్చిన ఆ జట్టు స్లార్ ప్లేయర్లు మిఛెల్ మార్ష్, ట్రిస్టన్ స్టబ్స్.. విశాఖ తీరంలో సందడి చేశారు. అలలపై తేలియాడారు. సర్ఫింగ్ విన్యాసాలు చేశారు. వారితో ఫొటోలు దిగడానికి సందర్శకులు పోటీ పడ్డారు.












Click it and Unblock the Notifications