సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మరో కీలక మార్పు
IPL 2024, SRH: ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. మార్చి 22వ తేదీన ఈ సీజన్ ఆరంభం కానుంది. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది.
ఐపీఎల్ ఆడే అన్ని జట్లు కూడా సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో జరిగిన వేలం పాట తరువాత అన్ని ఫ్రాంఛైజీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలామంది ప్లేయర్లు అటు ఇటు అయ్యారు. కొత్త ఫ్రాంఛైజీల తరఫున ఆడబోతోన్నారు. కొత్త సారథులు వచ్చారు. ఓ మోస్తరు ప్లేయర్లు భారీ రేటు పలికారు. మరికొందరు స్టార్ ఆటగాళ్లు అన్ సోల్డ్‌గా మిగిలారు.

ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్- కప్ కొట్టాలనే పట్టుదలతో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే ఆ జట్టు సారథి మారిపోయాడు. మొన్నటి వరకు కేప్టెన్‌గా వ్యవహరిస్తూ వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ సునామీ ఎయిడెన్ మార్క్‌రమ్.. తన స్థానాన్ని కోల్పోయాడు. కేప్టెన్సీ పదవిని వదులుకున్నాడు.
ఈ సీజన్‌లో కొత్త కేప్టెన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రకటించింది కూడా. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో జట్టును ఛాంపియన్‌గా నిలిపిన ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌కు పగ్గాలను అప్పగించింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన మెగా వేలం పాటలో 20.5 కోట్ల రూపాయలకు అతణ్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
అక్కడితో ఆగట్లేదు సన్‌రైజర్స్ హైదరాబాద్. కొత్త బౌలింగ్ కోచ్‌ను కూడా వెదుక్కుంది. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను బౌలింగ్ కోచ్‌గా అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఈ డిపార్ట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తోన్న దక్షిణాఫ్రికా స్టార్ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్.. జట్టుకు దూరమైన నేపథ్యంలో ఫ్రాంక్లిన్‌కు చోటు కల్పించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజన్‌కు డేల్ స్టెయిన్ దూరంగా ఉండాల్సి వచ్చింది.
జేమ్స్ ఫ్రాంక్లిన్.. 12 సంవత్సరాల పాటు న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 2001 నుంచి 2013 వరకు 31 టెస్టులు, 110 వన్డేలు, 38 టీ20 ఇంటర్నేషనల్స్‌లో మెరిశాడు. జట్టులో ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ కూడా అతనికి కొత్తేమీద కాదు.
2011, 2012 సీజన్లల్లో ముంబై ఇండియన్స్ తరఫున మ్యాచ్‌లను ఆడాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ దుర్హం, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా వ్యవహరించిన డేనియల్ వెటోరీకి ఫ్రాంక్లిన్ స్నేహితుడు.












Click it and Unblock the Notifications