IPL 2024: రోహిత్ ను తప్పించడం ఎందుకు కరెక్ట్ అంటే ? ముంబై హెడ్ కోచ్ మార్క్ బౌచర్..!
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ దగ్గరపడుతోంది. ప్రతీ జట్టూ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. గతేడాది ఫీట్లను రిపీట్ చేయాలని కొన్ని జట్లు తాపత్రయ పడుతుంటే మరికొన్ని జట్లు గత సీజన్ చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ఫ్రెష్ సీజన్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తాజా సీజన్ కోసం ఐపీఎల్ టాప్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ వేసిన ఓ ఎత్తుగడపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. దీంతో జట్టు హెడ్ కోచ్ మార్క్ బౌచర్ దీన్ని సమర్ధించుకున్నాడు.
2022లో ముంబై హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించాలన్న నిర్ణయం వెనుక ఏం జరిగిందో తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చాడు. ఇది పూర్తిగా క్రికెటింగ్ నిర్ణయమన్నాడు. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై జట్టు రోహిత్ శర్మ నుంచి బ్యాటర్ గా ఎక్కువ ఆశిస్తున్నట్లు బౌచర్ తెలిపాడు. ముంబై జట్టు ప్రస్తుతం మార్పు చెందాల్సిన పరిస్ధితుల్లో ఉందని, దీన్ని ఎక్కువ మంది భారతీయులు అర్దం చేసుకోలేకపోవడం వల్లే విమర్శలు ఎదురయ్యాయన్నాడు.

రోహిత్ ఐపీఎల్ కెప్టెన్సీ చేపట్టి పదేళ్లు పూర్తయిందని, ఇందులో ఐదు టైటిళ్లు కూడా సాధించాడని, అతని నాయకత్వ లక్షణాలపై ఎలాంటి ప్రశ్నలూ లేవని ముంబై హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తెలిపాడు. అయితే గత కొన్ని సీజన్లుగా ఈ ముంబై ఓపెనర్ పరుగులు చేయలేకపోతున్నాడని బౌచర్ గుర్తుచేశాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల రోహిత్ మరింత స్వేచ్ఛగా ఆడేందుకు దోహదపడుతుందని తెలిపాడు.
ముంబై టీమ్ తో తాను మాట్లాడుతున్నప్పుడు రోహిత్ బ్యాటర్ గా రాణించేందుకు ఇదే మంచి అవకాశం అని భావించినట్లు బౌచర్ తెలిపాడు. కెప్టెన్సీ ద్వారా రోహిత్ పై ఉండే ఒత్తిడి తొలగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బౌచర్ చెప్పకనే చెప్పేశాడు. కానీ ఇది అంతిమంగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications