IPL 2026: లక్నో కొంపముంచిన మార్క్‌రమ్ మామ .. పంజాబ్ కింగ్స్ రికార్డ్ విజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. పేలవ ప్రదర్శనతో హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టకుంది. ఆదివారం ముల్లాన్‌పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల భారీ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ సీజన్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేసి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. ఆ తర్వాత లక్నో బ్యాటర్లు చేతులెత్తేసారు. ఎయిడెన్ మార్క్‌రమ్ చెత్త బౌలింగ్ లక్నో కొంపముంచింది.
రికార్డ్ స్కోర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య(37 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 93), కూపర్ కనోల్లీ(46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) భారీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(2/25), సిద్దార్థ్(2/35) రెండేసి వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ, మోహ్‌సిన్ ఖాన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రిషభ్ పంత్(23 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 43), ఆయుష్ బదోని(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35), మిచెల్ మార్ష్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), ఎయిడెన్ మార్క్‌రమ్(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) పోరాటం సరిపోలేదు. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్(2/37) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్..
ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే తొలి 6 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డ్ సాధించింది. తొలి 6 మ్యాచ్‌ల్లో 5 గెలిచిన పంజాబ్ కింగ్స్.. కేకేఆర్‌తో మ్యాచ్ వర్షంతో రద్దవ్వడంతో ఒక పాయింట్ అందుకుంది. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా ఈ రికార్డ్ సాధించలేదు.
కొంపముంచిన మార్క్‌రమ్..
ఎయిడెన్ మార్క్‌రమ్ చెత్త బౌలింగ్ లక్నో సూపర్ జెయింట్స్ పతనాన్ని శాసించింది. ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేసిన మార్కరమ్ 32 పరుగులు సమర్పించుకోని లక్నోకు తీవ్ర నష్టం చేశాడు. అతను వేసిన 13వ ఓవర్‌లో కూపర్ కన్నోల్లీ 6, 6, 6, 1 బాదగా.. ప్రియాన్ష్ ఆర్య 6, 6 బాదాడు. ఈ ఓవర్‌లో మార్క్‌రమ్ ఒక వైడ్ కూడా వేయడంతో 32 పరుగులు వచ్చాయి.
ఈ ఓవర్‌తోనే మ్యాచ్ మూమెంటమ్ పూర్తిగా మారిపోవడంతో పాటు పంజాబ్ కింగ్స్ 254 పరుగుల రికార్డ్ స్కోర్ చేయగలిగింది. అతను గనుక కాస్త కట్టడిగా బౌలింగ్ చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications