IPL 2026: ట్రాప్‌లో పడ్డ లక్నో.. నవ్వుకున్న కావ్య మారన్!
IPL 2026: ఐపీఎల్ వేలం అంటే కేవలం ఆటగాళ్లను కొనడం మాత్రమే కాదు.. అది ఓ చదరంగం ఆటలాంటిది. ప్రత్యర్థిని దెబ్బకొట్టడానికి వారి దగ్గర ఉన్న బడ్జెట్‌ను ఖాళీ చేయడానికి ఫ్రాంచైజీలు వేసే ఎత్తుగడలు ఒక్కోసారి ఊహాతీతంగా ఉంటాయి. ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యమారన్ వేసిన ఓ వ్యూహం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కావ్య మారన్ విసిరిన వలలో పడి లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.8.60 కోట్లు సమర్పించుకోవడం విశేషం.
కావ్యమారన్ 'మైండ్ గేమ్'.. ట్రాప్‌లో పడ్డ లక్నో!
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ పేరు వేలంలోకి వచ్చినప్పుడు మొదట సైలెంట్‌గా ఉన్న కావ్య మారన్.. ఒక్కసారిగా బిడ్డింగ్ మొదలుపెట్టారు. లక్నో కూడా పట్టువదలకుండా పోటీకి రావడంతో ధర అమాంతం పెరిగింది. రూ. 8.60 కోట్ల వద్ద లక్నో బిడ్‌ను ఖరారు చేయగానే, కావ్య మారన్ ముఖంలో కనిపించిన ఒక విచిత్రమైన నవ్వు ఇప్పుడు చర్చకు దారితీసింది. "ఆమెకు నిజంగా ఇంగ్లిస్ అవసరం లేదు, కేవలం లక్నో పర్సులో ఉన్న డబ్బును తగ్గించడానికే కావాలని ధర పెంచారు" అని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. చివరికి కావ్య అనుకున్నది సాధించారు.. లక్నో భారీ మూల్యం చెల్లించుకుంది.

4 మ్యాచ్‌ల కోసం రూ. 8.6 కోట్లా? అసలు ట్విస్ట్ ఇక్కడే!
లక్నో టీమ్ మేనేజ్‌మెంట్ ఇంత భారీ ధర పెట్టి కొన్న ఇంగ్లిస్.. వచ్చే సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండకపోవడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలోనే జోష్ ఇంగ్లిస్ వివాహం జరగనుంది. పెళ్లి పనుల నిమిత్తం జోష్ ఇంగ్లిస్ ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉండటంతో, కేవలం మొదటి 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని సమాచారం. రూ. 8.60 కోట్లను 4 మ్యాచ్‌లకు పంచితే.. ఒక్కో మ్యాచ్‌కు లక్నో దాదాపు రూ. 2.15 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక వింతైన, ఖరీదైన డీల్ అని చెప్పవచ్చు.
అవసరం లేకున్నా కొన్నారా?
లక్నో సూపర్ జెయింట్స్ జట్టును పరిశీలిస్తే ఇప్పటికే అక్కడ వికెట్ కీపర్ల సందడి ఉంది. టీమిండియా స్టార్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పటికే జట్టులో ఉన్నాడు. వెస్టిండీస్ విధ్వంసక వీరుడు నికోలస్ పూన్ కూడా జట్టులో ఉండడం గమనార్హం. ఇద్దరు మంచి కీపర్లు, ఫినిషర్లు ఉన్నప్పటికీ.. కేవలం సగం సీజన్ కూడా ఆడని ఇంగ్లిస్ కోసం ఇంత బడ్జెట్ కేటాయించడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇంగ్లిస్‌కు 'డబుల్' ధమాకా!
జోష్ ఇంగ్లిస్ కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. గత సీజన్‌లో పంజాబ్ తరపున బుమ్రా బౌలింగ్‌ను సైతం చీల్చి చెండాడిన ఇతని స్ట్రైక్ రేట్ 160 పైమాటే. అటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ రెండు సెంచరీలు బాదిన ఫామ్ ఉంది. పెళ్లి చేసుకోబోతున్న ఇంగ్లిస్‌కు, లక్నో రూపంలో రూ. 8.6 కోట్ల 'వెడ్డింగ్ గిఫ్ట్' ముందే అందజేసినట్లయింది. ఓ వైపు కావ్య మారన్ తెలివైన ఎత్తుగడ, మరోవైపు లక్నో తీసుకున్న సాహసోపేతమైన (లేదా తొందరపాటైన) నిర్ణయం.. ఐపీఎల్ 2026లో ఈ జోష్ ఇంగ్లిస్ 4 మ్యాచ్‌ల్లోనైనా మ్యాజిక్ చేస్తాడా? లేక లక్నోకు ఈ డీల్ భారంగా మారుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications