ఆయన వల్లే ఈ సెంచరీ.. నా లక్కీ ఛార్మ్: సంజూ శాంసన్
చెపాక్ స్టేడియం క్యూరేటర్ వల్లే తాను సెంచరీ చేయగలిగానని చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ అన్నాడు. మంచి వికెట్ తయారు చేసిన క్యూరేటర్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్(56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. ఈ టోర్నీని పేలవంగా ప్రారంభించిన సంజూ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో తొలి సెంచరీ బాదిన బ్యాటర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు.
ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో హోస్ట్ రవిశాస్త్రితో మాట్లాడిన సంజూ శాంసన్.. తన మాటలతో నవ్వులు పూయించాడు. 'రవి సర్.. మీరు నా లక్కీ ఛార్మ్. ప్రతీ మ్యాచ్‌కు ముందు మిమ్మల్ని కలవడం నాకు అదృష్టంగా అనిపిస్తోంది. కాబట్టి దయచేసి ప్రతీ మ్యాచ్‌కూ రండి సర్(నవ్వుతూ). మీకు నా స్పెషల్ థ్యాంక్స్. వరుస వైఫల్యాల తర్వాత సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది.

క్యూరేటర్‌కు థ్యాంక్స్..
నిజం చెప్పాలంటే.. మనం ఎంత ఫామ్‌లో ఉన్నా.. దేశం కోసం ఎన్ని మ్యాచ్‌లు గెలిపించినా.. ఒకట్రెండు వైఫల్యాలు ఎదురైతే మనసులో ఎన్నో సందేహాలు మొదలవుతాయి. కానీ నేను మళ్ళీ నా బేసిక్స్‌కు కట్టుబడి, నాపై నమ్మకం ఉంచి ఆడాలనుకున్నాను. ఆరంభంలోనే దూకుడుగా ఆడాలా లేక నా గేమ్ ప్లాన్ మార్చుకోవాలా అనే ఆలోచనలు నన్ను వెంటాడాయి. కానీ నాకు ఏది వర్కౌట్ అవుతుందో దానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాను. అదృష్టవశాత్తూ ఈ రోజు అది అద్భుతంగా పని చేసింది.
ఈ వికెట్ చాలా బాగుంది. ఇంత మంచి వికెట్ తయారు చేసిన క్యూరేటర్‌కు ధన్యవాదాలు. ఈ టార్గెట్‌ను మేం కాపాడుకోగలమని ఆశిస్తున్నా. ఈ పిచ్‌పై ఆరంభంలో బంతి కొంచెం ఆగుతూ వస్తోంది. ముఖ్యంగా పవర్ ప్లేలో అక్షర్ పటేల్ బౌలింగ్ చేసినప్పుడు ఆగుతూ వచ్చింది. కానీ బంతి పాతబడే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. మేం కేవలం మా బేసిక్స్‌ను అనుసరించాం. ఆయుష్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పడం సంతోషంగా ఉంది. అతను అద్భుతమైన యువ ఆటగాడు. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించాను.
ఈ రోజుల్లో లక్ష్యాన్ని ఊహించలేం..
ఈ రోజుల్లో మనం ముందే ఒక లక్ష్యాన్ని ఊహించలేం. ఒకసారి సెటిల్ అయిన తర్వాత బోర్డుపై ఎంత వీలైతే అంత పెద్ద స్కోరు ఉంచాలని చూస్తాం. అదే మా ప్లాన్. మేం ఎక్కువ వికెట్లు కోల్పోలేదు. మా బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బలంగా ఉంది. అందుకే సరైన బౌలర్లను ఎంచుకుని వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. నిజాయితీగా చెప్పాలంటే ఇది సవాలుతో కూడుకున్న లక్ష్యమే. మా వద్ద ఉన్న బౌలర్లతో పవర్‌ప్లేలో మంచి ప్రదర్శన చేస్తే.. ఈ స్కోరును కాపాడుకోవడం సులువు అవుతుంది.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.












Click it and Unblock the Notifications