IPL Auction 2026: ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఎవరీ ప్రశాంత్ వీర్?
అబుదాబీ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఒక అన్‌క్యాప్డ్ (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని) ప్లేయర్ చరిత్ర సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఏకంగా రూ. 14.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రశాంత్ రికార్డు నెలకొల్పాడు. మరో వైపు మరో అన్ క్యాప్ట్ ప్లేయర్ కార్తీక్ శర్మను కూడా రూ. 14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
ఎవరీ ప్రశాంత్ వీర్?.. రూ. 14 కోట్ల జాక్‌పాట్ వెనుక కథేంటి?
కేవలం రూ. 30 లక్షల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్.. ఒక్కసారిగా కోటీశ్వరుడిగా మారిపోయాడు. ప్రశాంత్ వీర్ ప్రతిభను గుర్తించిన సీఎస్కే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో భారీ పోటీ పడి మరీ అతన్ని దక్కించుకుంది. 20 ఏళ్ల ప్రశాంత్ వీర్ స్వస్థలం యూపీలోని అమేథీ. ప్రశాంత్ వీర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయగల అద్భుత ఆల్‌రౌండర్ కావడం విశేషం. రవీంద్ర జడేజా తరహాలోనే బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించగల సత్తా ఉండటంతో ఇతన్ని'జూనియర్ జడేజా'గా అభివర్ణిస్తున్నారు.

ఈ స్థాయి గుర్తింపు ఎలా వచ్చింది?
ప్రశాంత్ వీర్ ఎదుగుదల చాలా వేగంగా జరిగింది. ప్రధానంగా ఈ కింది టోర్నీలు అతని కెరీర్‌ను మలుపు తిప్పాయి: యూపీ టీ20 లీగ్‌లో నోయిడా సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ స్కౌట్ల దృష్టిలో పడ్డాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 112 పరుగులు (స్ట్రైక్ రేట్ 170) చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఒకే మ్యాచ్‌లో 10 బంతుల్లో 37 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ట్రయల్స్‌లో ప్రశాంత్ అద్భుతంగా రాణించాడు. భవిష్యత్తులో రవీంద్ర జడేజాకు వారసుడిగా నిలవగలడని భావించిన ధోనీ సేన, అతని కోసం భారీ ధర వెచ్చించింది.
వేలంలో బిడ్డింగ్ వార్
ప్రశాంత్ పేరు రాగానే మొదట ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తి చూపాయి. ధర రూ. 5 కోట్లు దాటాక రాజస్థాన్ రాయల్స్ రేసులోకి వచ్చింది. చివరకు సీఎస్కే, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. రూ. 10 కోట్లు దాటినా ఏ జట్టూ తగ్గలేదు. చివరకు రూ. 14.20 కోట్ల వద్ద సీఎస్కే విజయం సాధించింది. 20 ఏళ్ల వయసులోనే ఇంతటి భారీ ధర దక్కించుకోవడం ప్రశాంత్ వీర్ ప్రతిభకు నిదర్శనం. రవీంద్ర జడేజా వంటి దిగ్గజ ఆల్‌రౌండర్ సమక్షంలో ప్రశాంత్ తనను తాను ఎలా మలుచుకుంటాడో చూడాలి.












Click it and Unblock the Notifications