ఇక IPL ఏడాదికి రెండు సార్లు, BCCI డెసిషన్- ఇదీ షెడ్యూల్..!!
IPL: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు ప్రతీ వేసవిలో క్రికెట్ పండుగ గా సాగుతున్న ఐపీఎల్ ఇక నుంచి ప్రతీ ఏటా రెండు సార్లు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. తాజాగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ మేరకు సంకేతాలు ఇస్తోంది. మ్యాచుల సంఖ్య పెంపు.. రెండు సార్లుగా షెడ్యూల్ నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ పూర్తయిన తరువాత ఈ కొత్త ప్రతిపాదన పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
క్రికెట్ స్వరూపాన్ని మార్చేసి.. ఆదాయన్ని పెంచేసి... భారీ వ్యూయర్ షిప్ దక్కించుకుంటున్న ఐపీఎల్ కొత్త రూపంలో ముందుకు రానుంది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. ఇకపై ఏడాదికి ఒకసారి కాకుండా, రెండు విభిన్న సమయాల్లో ఐపీఎల్ నిర్వహించేలా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తాజాగా లీగ్ విస్తరణపై కీలక సంకేతాలు ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిన 19 సీజన్లు ప్రతీ ఏటా మార్చి నుంచి మే వరకు రెండు నెలల పాటు కొనసాగుతోంది. కాగా.. ఈ టోర్నీని మరింత పెద్దదిగా మార్చాలని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతమున్న 74 మ్యాచ్‌ల సంఖ్యను భవిష్యత్తులో 94 మ్యాచ్‌లకు పెంచాలనేది బీసీసీఐ అసలు ప్రణాళిక. అయితే, జూన్ నెలలో భారతదేశంలో ఉండే తీవ్రమైన ఎండలు, ఉక్కపోత వల్ల ఆటగాళ్లకు, మైదానానికి వచ్చే అభిమానులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.

తుది కసరత్తు తరువాత నిర్ణయం
దీంతో, తాజా ఆలోచనల మేరకు రెండు భాగాలుగా విభజించి ఐపీఎల్ నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. దీని ప్రకారం, మొదటి విడతను ఫిబ్రవరి నుంచే ప్రారంభించి ఏప్రిల్ లోపు ముగించడం, ఆ తర్వాత రెండో విడతను సెప్టెంబర్ - అక్టోబర్ నెలల మధ్య నిర్వహించడంపై కసరత్తులు జరుగుతున్నాయి. ముఖ్యంగా దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో భారత్‌లో వ్యాపార ప్రకటనల సందడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ సమయాన్ని అందిపుచ్చు కోవాలని బోర్డు భావిస్తోంది. అయితే, ప్రసారదారులతో (బ్రాడ్‌కాస్టర్స్) చర్చించిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. ఈ రకంగా నిర్వహించటం ద్వారా రెగ్యులర్ క్రికెట్ పైన పడే ప్రభావం.. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌కు కలిగే ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. వీటిని పైన పూర్తి స్థాయిలో చర్చించి... ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications