మళ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి విరాట్ కోహ్లీ?
టీమిండియా రన్ మెషీన్, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ టెస్ట్ క్రికెట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అంటే ఔననే అంటున్నారు కోహ్లీ అభిమానులు. గతేడాది అనుకోకుండా టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు మళ్లీ వైట్ జెర్సీ వేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. గడిచిన వారం రోజుల్లో కింగ్ కోహ్లీ చేసిన కొన్ని పనులు, కోహ్లీ కోచ్ ఇచ్చిన హింట్స్ ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
రెడ్ బాల్ బూట్లు గిఫ్ట్.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ సరికొత్త చర్చకు అసలు కారణం విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ క్రేజీ వీడియో. విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్, మెంటార్ అయిన రాజ్ కుమార్ శర్మకు ఓ ప్రత్యేకమైన షూస్ జతను బహుమతిగా ఇచ్చాడు. ఆ బూట్ల డిజైన సరిగ్గా 'రెడ్ బాల్' (టెస్ట్ క్రికెట్ బాల్) ఆకారంలో ఉండటం విశేషం. ఆ షూస్ ఇస్తూ కోహ్లీ సరదాగా.. "అసలు ఈ రెడ్ బాల్ క్రికెట్ గోల ఏంటో మీకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాను" అని కామెంట్ చేశాడు. విరాట్ చేసిన ఈ చిన్న చిన్న సైగలే ఆయన టెస్ట్ రీ-ఎంట్రీకి అసలైన హింట్స్ అంటూ అభిమానులు ఇంటర్నెట్‌లో తెగ షేర్ చేస్తున్నారు.

గతేడాది హఠాత్తుగా టెస్ట్ రిటైర్మెంట్
టీ20 క్రికెట్, భారీ ఫ్రాంచైజీ లీగ్‌ల హడావుడి నడుస్తున్న ఈ రోజుల్లో కూడా టెస్ట్ క్రికెట్‌ను అమితంగా ప్రేమించే అతికొద్ది మంది ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అలాంటి కింగ్ కోహ్లీ.. గతేడాది (మే 2025లో) అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాడు. విరాట్ కోహ్లీ లేని భారత టెస్ట్ జట్టును ఊహించుకోలేమని అభిమానులు అప్పట్లో చాలా బాధపడ్డారు. అయితే ఏడాది తిరిగేసరికి మళ్లీ ఆయన చుట్టూనే రెడ్ బాల్ ముచ్చట నడుస్తుండటంతో కమ్‌బ్యాక్ ఖాయమనే నమ్మకం అందరిలో పెరుగుతోంది.
కోచ్ లీక్ చేసిన అసలు సీక్రెట్!
ఈ ఊహాగానాలకు మరింత ఊతమందిస్తూ విరాట్ కోహ్లీ కోచ్ రాజ్‌కుమార్ శర్మ రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిమానులు కోహ్లీని మళ్లీ టెస్టుల్లో చూడాలని పట్టుబడుతున్నారని, ఇదే విషయంపై తాను ఇటీవల విరాట్‌తో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ వీడియో, కోచ్ చేసిన కామెంట్స్ కేవలం పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికా? లేక త్వరలోనే ఓ భారీ ప్రకటనతో టెస్ట్ క్రికెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ విరాట్ గనుక నిజంగా టెస్ట్ రీ-ఎంట్రీ ఇస్తే అది భారత క్రికెట్‌కు అంతకంటే పెద్ద పండగ మరొకటి ఉండదు.












Click it and Unblock the Notifications