పెళ్లిపీటలు ఎక్కబోతున్న టీమిండియా మణికట్టు మాంత్రికుడు
భారత క్రికెట్ స్టార్ స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ ఒకింటివాడు కాబోతోన్నాడు. ఇంకో రెండ్రోజుల్లో వైవాహిక జీవితాన్ని ఆరంభించనున్నాడు. ఇప్పటికే వధువు స్వరాష్ట్రంలో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా షురూ అయ్యాయి. ఈ మధ్యాహ్నం కుల్ దీప్ యాదవ్, అతని కుటుంబ సభ్యులు ఉత్తరాఖండ్ కు చేరుకున్నారు. డెహ్రాడున్ లో డెహ్రాడూన్‌లో అడుగుపెట్టారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఉత్తరాఖండ్ వారికి ఘటన స్వాగతం పలికింది. డప్పులు, వాయిద్యాలతో ఘన స్వాగతం లభించింది. అసోసియేషన్ అధికారులు కేదార్‌నాథ్ ప్రసాదం అందజేశారు.
కుల్ దీప్ యాదవ్ ఈ నెల 14వ తేదీన వంశికతో ఏడడుగులు వేయనున్నాడు. వివాహ కార్యక్రమాలన్నీ కూడా ముస్సోరీలో జరుగుతాయి. ఇక్కడి హోటల్ సవోయ్ దీనికి వేదిక. ఈ సెలబ్రేషన్స్ కు హోటల్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ హోటల్ లో అన్ని రూమ్ లను కుల్ దీప్ యాదవ్ కుటుంబ సభ్యులు బుక్ చేసుకున్నారు. పెళ్లి వేడుకలు ముగిసేంత వరకు అంటే రేపు, ఎల్లుండి ఈ హోటల్ పూర్తిగా వారి ఆధీనంలోనే ఉండబోతోంది. బయటి వారికెవరికీ గదులు అద్దెకు ఇవ్వట్లేదు యాజమాన్యం.

అతిథుల కోసం దాదాపు 80 గదులు కేటాయించారు. హోటల్ ప్రాంగణంలో అద్భుతమైన పెళ్లి మండపం సిద్ధం చేయగా, సంగీత్ కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 200 మంది అతిథులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. ఈ రాత్రికే వారంతా ముస్సోరీకి చేరుకోనున్నారు. అతిథుల జాబితాలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ వంటి ప్రముఖ ఆటగాళ్లతో పాటు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఉన్నాడు. వారందరూ పెళ్లికి అటెండ్ కానున్నారు.
పలువురు పారిశ్రామిక వేత్తలు కూడా ఈ వేడుకలో హాజరుకానున్నారు. వారికోసం అద్భుతమైన ఆతిథ్య ఏర్పాట్లు జరిగాయి. వివాహ విందులో ప్రత్యేకమైన పహాడీ వంటకాలు అందించనున్నారు. మండవే కి రోటీ, లాల్ చావల్ తో పాటు అనేక సాంప్రదాయ పహాడీ వంటకాలు ఉన్నాయి.. వెడ్డింగ్ మెనూలో. ఒక్క ప్లేట్ భోజనం ధర 6,000 కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.
కుల్ దీప్ యాదవ్ గత ఏడాది జూన్ 4న లక్నోలో జరిగిన ప్రైవేట్ వేడుకలో వంశికతో నిశ్చితార్థం చేసుకున్నాడు. కుల్దీప్, వంశిక చిన్ననాటి నుంచీ ఒకరికొకరు తెలుసు. ఇద్దరూ కాన్పూర్‌కు చెందినవారే. వారి స్నేహం సంవత్సరాల క్రితం మొదలై ప్రేమగా మారింది. కాన్పూర్‌లోని శ్యామ్ నగర్ ప్రాంతంలో పుట్టి పెరిగిన వంశిక, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను పూర్తిచేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications