వెక్కి వెక్కి ఏడ్చిన నెయ్‌మార్: సాకర్ కు సెలవ్: రొనాల్డో సైతం
ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ లో ఓ సంచలనం విజయం నమోదైంది. అయిదుసార్లు ఛాంపియన్ జట్టు బ్రెజిల్ ఇంటిదారి పట్టింది. 2-1 తేడాతో నార్వే చేతిలో ఓటమిపాలైంది. న్యూయార్క్ మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32లో నార్వే ఈ చారిత్రక విజయాన్ని అందుకుంది. స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ చివరి నిమిషాల్లో చేసిన రెండు గోల్స్.. బ్రెజిల్ పరాజయాన్ని శాసించాయి. ఈ విజయంతో నార్వే ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఫిఫా రౌండ్ ఆఫ్ 16లో ఎంట్రీ ఇవ్వడం నార్వే జట్టుకు ఇదే మొదటిసారి.
ఈ ఓటమి.. బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్‌మార్ కేరీర్ కు స్వస్తి పలికింది. సాకర్ కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నమెంట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అత్యంత బాధాతప్త హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. చివరి మ్యాచ్ ఆడేశానని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే నెయ్ మార్ గ్రౌండ్ లోనే చాలాసేపు కూర్చున్నాడు. చేతులతో ముఖాన్ని దాచుకుని వెక్కివెక్కి ఏడ్చాడు.

ఈ కన్నీళ్లు.. ఓటమితో వచ్చిన ఆవేదన మాత్రమే కాదు.. బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున అతని సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికే క్షణాలు అయ్యాయి. గాయాల కారణంగా 2023 తర్వాత జట్టుకు దూరం అయ్యాడు 34 ఏళ్ల నెయ్ మార్. ఈ వరల్డ్ కప్ కు ముందే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకాలని భావించాడు. బ్రెజిల్ హెడ్ కోచ్ కార్లో అన్సెలొట్టి నుంచి అందిన పిలుపుతో ఫిఫా టీమ్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు గానీ తనదైన శైలిలో మెరుపులు మెరిపించలేకపోయాడు. ఈ టోర్నీలో ప్రారంభ మ్యాచ్ లల్లో ఆడలేదు కూడా. మునుపటి వేగాన్ని కోల్పోయాడు. యువ ఆటగాళ్లతో నిండిన జట్టుకు నైతిక బలాన్ని ఇచ్చాడు.
నెయ్ మార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రస్థానం ఎక్కడ మొదలైందో సరిగ్గా అక్కడే ముగియడం విశేషం. సుమారు 16 సంవత్సరాల కిందట 2010 ఆగస్టులో ఇదే మెట్‌లైఫ్ స్టేడియంలో అమెరికాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో బ్రెజిల్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో గోల్‌తో తన అద్భుతమైన కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పుడు అదే మైదానంలో నార్వేపై కూడా గోల్ సాధించి అంతర్జాతీయ సాకర్ కు వీడ్కోలు చెప్పడం అభిమానుల కళ్లలో నీళ్లు తెప్పించింది.
నాలుగు ప్రపంచకప్‌లు, రెండు ఒలింపిక్స్‌లలో బ్రెజిల్ ప్రతిష్టను కాపాడటానికి తన వంతు కృషి చేసిన ఈ సూపర్ స్టార్.. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఇక్కడి వరకు వచ్చాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత అతను మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. మెట్‌లైఫ్ స్టేడియంలోనే తన ప్రయాణం ప్రారంభమైందని, ఇక్కడే ముగిసిందని చెప్పాడు. ఇప్పుడు అంతా పూర్తయిందంటూ చెమ్మగిల్లిన కళ్లతో వెల్లడించాడు.
అంతకుముందే.. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్‌కు సంబంధించి సంచలన ప్రకటన చేశాడు. ఈ ఫిఫా టోర్నమెంటే తన కెరీర్‌లో చివరి వరల్డ్ కప్ అని ప్రకటించాడు. ఈ ఆఖరి టోర్నీలోని ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇది తన చివరి ప్రపంచకప్ ప్రయాణం అనడంలో ఎటువంటి సందేహం లేదని, స్పెయిన్‌తో జరగబోయే మ్యాచే తన కెరీర్ లో ఆఖరి మ్యాచ్ కాకూడదని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. కప్‌ను గెలవాలనే బలమైన ఆకాంక్షతోనే తామిక్కడికి వచ్చామని రొనాల్డో స్పష్టం చేశాడు.
తన రిటైర్మెంట్‌కు సంబంధించి తరచూ విలేకరులు అడుగుతున్న ప్రశ్నలపై రొనాల్డో తీవ్రంగా స్పందించాడు. తాను ఎప్పుడు మైదానాన్ని వీడాలో వేరెవరో నిర్ణయించలేరని తేల్చి చెప్పాడు. ఎప్పుడు రిటైర్ అవ్వాలనేది తన సొంత నిర్ణయమని, దేశం కోసం ఆడటాన్ని గౌరవంగా భావిస్తానని పేర్కొన్నాడు. గ్రౌండ్ లో ఉన్నా బెంచ్‌పై కూర్చున్నా జట్టు విజయంలో తన పాత్ర ఎప్పటికీ ఉంటుందని తేల్చి చెప్పాడు.
ఈ ప్రపంచకప్‌లో రొనాల్డో ప్రదర్శన అద్భుతంగా సాగుతోంది. నాలుగు మ్యాచ్‌లలో మూడు గోల్స్ సాధించడం ద్వారా తాను ఇంకా ఫామ్‌లోనే ఉన్నానని ఆయన నిరూపించుకున్నాడు. రౌండ్ ఆఫ్ 16లో బలమైన స్పెయిన్ తో పోర్చుగల్ అమీతుమీ తేల్చుకోనుంది. ఆస్ట్రియాపై 3-0తో అద్భుత విజయాన్ని అందుకుని టోర్నీలో దూసుకుపోతున్న స్పెయిన్‌ను కట్టడి చేయడం అంత సులువు కాదు. మేనేజర్ లూయిస్ డి లా ఫ్యూయెంటె నేతృత్వంలో స్పెయిన్ డిఫెన్స్ విభాగాన్ని పటిష్ఠం చేసుకుంది.












Click it and Unblock the Notifications