ఆపరేషన్ క్లీన్ అండ్ గ్రీన్: కత్తి నూరుతున్న బోర్డు
Pakistan Cricket Board: టీ20 వరల్డ్ కప్ 2024లో ఊహించిందే జరిగింది. ఈ ప్రిస్టేజియస్ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ తప్పుకొంది. సూపర్ 8 చేరకుండానే వెనుదిరిగింది. లీగ్స్ దశలోనే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం. లీగ్స్‌లో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే.. ఆ జట్టు తలరాత ఖరారైంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఎలాంటి ఉపయోగం ఉండదు.
వరల్డ్ కప్ గ్రూప్ ఏలో కొనసాగుతోంది పాకిస్తాన్. ఈ గ్రూప్ నుంచి భారత్, యునైటెడ్ స్టేట్స్.. సూపర్ 8కు చేరుకున్నాయి. పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్ తిరుగుముఖం పట్టాయి. ఒక్కో గ్రూప్ నుంచి సూపర్ 8 చేరాలంటే ఆరు పాయింట్లు అవసరమౌతాయి. ఇప్పటివరకు ఆడిన మూడింట్లో మూడు విజయాలు, ఆరు పాయింట్లతో భారత్.. సూపర్ 8కు అర్హత సాధించింది.

మూడు మ్యాచ్‌లల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు యునైటెడ్ స్టేట్స్ ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఐర్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఫలితంగా ఒక్కో పాయింట్ ఈ రెండు జట్లకూ దక్కింది. మొత్తం అయిదు పాయింట్లతో యునైటెడ్ స్టేట్స్.. సూపర్ 8కు చేరింది.
పాకిస్తాన్ తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం ఐర్లాండ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ గెలిచినా కూడా ఆ జట్టుకు దక్కేది నాలుగు పాయింట్లే. 6, 5 పాయింట్లతో ఇప్పటికే భారత్, యునైటెడ్ స్టేట్స్ తమ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాయి. ఫలితంగా పాకిస్తాన్‌తో పాటు కెనడా, ఐర్లాండ్.. టీ20 వరల్డ్ కప్ రేసు నుంచి తప్పుకొన్నాయి.
గ్రూప్ ఏలో భాగంగా జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాజయాన్ని చవి చూసింది బాబర్ ఆజమ్ సేన. యునైటెడ్ స్టేట్స్ చేతిలో మట్టికరిచింది. సూపర్ ఓవర్ వరకూ సాగిన ఈ మ్యాచ్‌లో ఏ మాత్రం రాణించలేకపోయింది. దాని ప్రభావమే ఈ ఫలితం. ఈ టోర్నమెంట్‌లో రాణించడానికి పాకిస్తాన్.. తీసుకున్న ఆర్మీ ట్రైనింగ్ కూడా నిష్ప్రయోజనమైనట్టే.
ఈ ఓటమి తరువాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జట్టు ప్రక్షాళనకు పూనుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కనీసం ఆరు మంది ప్లేయర్లపై వేటు వేయడానికి కత్తి నూరుతున్నట్లు చెబుతున్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా క్రమశిక్షణ తప్పిన, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిని జట్టు నుంచి పంపించబోతోంది.
ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మొహసిన్ నక్వీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. జట్టులో గ్రూపిజాన్ని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ప్రత్యేకించి- కేప్టెన్ బాబర్ ఆజమ్‌కు వ్యతిరేకంగా ఉండే వారిని సాగనంపుతారని తెలుస్తోంది. దీనిపై పాకిస్తాన్ మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి












Click it and Unblock the Notifications