రింకూ సింగ్ కీ ప్రేమ్ కహానీ: మాంఛి స్పోర్ట్స్ డ్రామా తీసేంత స్టఫ్ ఉంది భయ్యా
టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్, ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్.. ఎట్టకేలకు తన లవ్ స్టోరీని రివీల్ చేశాడు. లోక్ సభ సభ్యురాలు ప్రియా సరోజ్ తో తనకు ఏర్పడిన పరిచయాన్ని, అది ప్రేమగా మారిన వైనాన్ని వివరించాడు. ఓ స్పోర్ట్స్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు రింకూ సింగ్.
ప్రియా సరోజ్.. సమాజ్ వాది పార్టీ లోక్ సభ సభ్యురాలు, ఉత్తరప్రదేశ్ లోని మచిలీషెహర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆమె భారతీయ జనతా పార్టీకి చెందిన బీపీ సరోజ్ ను 35 వేలకు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు.

ప్రియా సరోజ్ తో ఇన్‌స్టాగ్రామ్ లైక్స్‌తో ప్రేమకథ ఆరంభమైనట్లు వెల్లడించాడు రింకూ సింగ్. 2022లో ఆమె పరిచయం ఏర్పడిందని పేర్కొన్నాడు. తన పేరు మీద ఏర్పాటైన సోషల్ మీడియా ఫ్యాన్ పేజీలో తొలిసారిగా ప్రియా సరోజ్ ఫొటో చూశానని, అప్పుడే తనకు బాగా నచ్చిందని వివరించాడు.
ఆమెకు రిప్లై ఇవ్వడానికి సందేహించినప్పటికీ- తన ఫొటోలను లైక్ చేయడంతో ప్రియా సరోజ్ తో మాట్లాడటానికి ధైర్యం చేశానని తెలిపాడు. మొదటగా తానే పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించానని చెప్పాడు. 2022లో ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ తర్వాత ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశానని చెప్పాడు.
ప్రియా సరోజ్ స్వగ్రామంలోని ఓటింగ్ కు సంబంధించిన ఓ ఫొటో తన ఫ్యాన్ పేజీలో పోస్ట్ అయిందని, అప్పుడే ఆమెను తొలిసారిగా చూశానని రింకూసింగ్ పేర్కొన్నాడు. చూడగానే నచ్చిందని, తనకు పర్ఫెక్ట్ జోడీ అవుతుందని భావించానని అన్నాడు. అప్పుడే మెసేజ్ చేద్దామని అనుకున్నప్పటికీ.. ధైర్యం చాల్లేదని వివరించాడు.
ఆ తర్వాత ప్రియా తన రెండు ఫోటోలను లైక్ చేయగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు మెసేజ్ చేశానని, దానికి పాజిటివ్ రిప్లై వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మాట్లాడుకోవడం మొదలుపెట్టామని, అభిప్రాయాలు పంచుకునే వాళ్లమని, అది తమ మధ్య పరిచయాన్ని ప్రేమగా మార్చిందని అన్నాడు.
ఈ ఏడాది జూన్‌లో ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు రింకూ సింగ్. ఈ ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వరుసగా దేశవాళీ టోర్నమెంట్లు, ఇంటర్నేషనల్ సీజన్ ఉన్నందున పెళ్లి వాయిదా పడింది. ప్రియా సరోజ్ లోక్ సభకు ఎన్నికైందని తెలిశాక చాలా సంతోషం పడ్డానని, సమాజానికి సేవ చేయాలనే ఆమె మనస్తత్వానికి అది సరైన పదవి అని పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications