ట్రాక్ ఎక్కేశాడు- కాచుకోండి ఇక
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ ఎట్టకేలకు ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. సెంచరీతో ట్రాక్ ఎక్కాడు. బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. అతను ఫామ్ లోకి రావడం అభిమానులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకున్న ఈ ఓపెనర్ అద్భుతమైన శతకంతో తన సత్తా చాటాడు. జట్టు భారీ స్కోరు సాధించడంలో, ఘన విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
సెంచరీ కోసం సంజు శాంసన్ తీసుకున్న బంతులు 52 మాత్రమే. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా బుల్లెట్ల వంటి 14 బౌండరీలు, మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. గత మూడు మ్యాచ్‌లలో వరుసగా 6, 7, 9 పరుగులకే పరిమితమైన అతను ఈ మ్యాచ్‌తో ఒక్కసారిగా గేర్ మార్చాడు. అద్భుతంగా పుంజుకున్నాడు. ఈ శతకం అతని ఐపీఎల్ కెరీర్‌లో నాలుగోది కాగా, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సాధించిన మొదటి శతకం ఇదే కావడం విశేషం.

ఈ సెంచరీ ఇన్సింగ్స్‌లో శాంసన్ మరో మైలురాయిని కూడా అందుకున్నాడు. తన టీ20 కెరీర్‌లో మొత్తం 400 సిక్సర్లను బాదాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు పథుమ్ నిశ్శంక అతని క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో అనేక రికార్డులను తిరగరాశాడు. 2021లో ఐపీఎల్ లో చివరిసారిగా సెంచరీ చేశాడు సంజు. ఆ తర్వాత మళ్లీ శతకం ముఖం చూడటం ఇదే. ఈ ఐపీఎల్ సీజన్‌లో నమోదైన మొదటి శతకమూ ఇదే.
ఈ మ్యాచ్ లో శాంసన్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడి 56 బంతుల్లో 115 పరుగులు సాధించాడు. ఫలితంగా సీఎస్‌కే 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ శతకం సంజూ ఐపీఎల్ కెరీర్‌లోకెల్లా అత్యంత వేగవంతమైనది. 2019లో 55 బంతుల్లో సెంచరీ సాధించిన శాంసన్.. ఈసారి 52 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో తన పాత రికార్డును తానే బద్దలు కొట్టాడు.
ఐపీఎల్‌కు ముందు జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026లో సంజూ శాంసన్ కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కొన్ని మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లు చేసినప్పటికీ, నాకౌట్ దశలో అదరగొట్టాడు. వెస్టిండీస్‌పై 97 (నాటౌట్), ఇంగ్లాండ్‌పై 89, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 89 రన్స్ చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయిదు ఇన్నింగ్స్‌లలో 80.25 సగటుతో 321 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.
2017 ఐపీఎల్ లో తొలి సెంచరీ చేశాడు సంజు శాంసన్. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ పై 63 బంతుల్లో 102 అందుకున్నాడు. 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 55 బంతుల్లో 102 ( నాటౌట్) కొట్టాడు గానీ ఆ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. 2021లో ఆర్ఆర్ తరఫునే పంజాబ్ కింగ్స్ పై 63 బంతుల్లో 119 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్ లో కూడా రాజస్థాన్ విజయం దక్కలేదు. తాజాగా సీఎస్కే తరఫున ఢిల్లీ కేపిటల్స్ పై మరో సెంచరీ బాదాడు.












Click it and Unblock the Notifications