జాక్‌పాట్ కొట్టిన సంజు శాంసన్..!!
టీ20 వరల్డ్ కప్ లో భారత్ ను సెమీ ఫైనల్స్ చేర్చిన సంజు శాంసన్ జాక్ పాట్ కొట్టాడు. సూపర్ 8లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అజేయంగా 50 బంతుల్లో 97 పరుగులు పిండుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో రాకెట్ లా దూసుకెళ్లాడు. కోల్‌కతాలో జరిగిన ఈ మ్యాచ్‌లో అతని ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో భారీగా ఎగబాకాడు. ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో ఏకంగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో 25 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ఇప్పడు అతని ర్యాంకింగ్ నంబర్ 40. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు 65 స్థానంలో ఉన్నాడు సంజు.
మరోవైపు అభిషేక్ శర్మ 874 రేటింగ్ పాయింట్లతో తన ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్‌జాద ఫర్హాన్‌పై 26 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు. ఫర్హాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ కూడా టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ తన స్థాయికి తగ్గట్లుగా ఆడట్లేదనేది స్పష్టమౌతోంది. ఆరు ఇన్నింగ్స్‌లలో 80 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు వరుసగా మ్యాచ్ లల్లో డకౌట్ అయ్యాడు.

టాప్ 10లో టీమిండియా బ్యాటర్ల హవా కొనసాగుతోంది. మరో డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. అయిదు నుండి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆరు, ఏడు స్థానాలను పరస్పరం మార్చుకున్నారు. టీ20 వరల్డ్ కప్ లో వీరిద్దరూ కూడా పెద్దగా రాణించట్లేదు. భారీ ఇన్నింగ్స్ ఆడట్లేదు. దూకుడుగా ఆడుతున్నప్పటికీ.. వాటిని భారీ స్కోర్లుగా మలచుకోవడంలో విఫలమౌతున్నారు. ఇద్దరూ కూడా నిలకడను కోల్పోతున్నారు.
ఐసీసీ టీ20ఐ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా ఒక స్థానం మెరుగుపరుచుకున్నాడు. రెండో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ ఓపెనర్ సయిమ్ అయూబ్‌ను మూడో స్థానంలోకి నెట్టాడు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడీ కేటగిరీలో. వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్- 11, న్యూజిలాండ్ కేప్టెన్ మిచెల్ సాంట్నర్- 12 స్థానాలకు ఎగబాకారు. తమ ర్యాంకింగ్స్‌లో మెరుగుదల చూపారు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఆరు స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. జింబాబ్వేపై 24 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడం.. అతనికి ప్లస్ పాయింట్ అయింది. జస్‌ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికాపై రెండు వికెట్లతో రాణించి ఒక స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. ఏడవ స్థానంలో నిలిచాడు.వరుణ్ చక్రవర్తి మూడు సూపర్ 8 మ్యాచ్‌లలో ఒక్కో వికెట్ పడగొట్టి తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications