అందరి నోళ్లూ ముయించాడు గానీ..
ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ అదరగొట్టాడు. బౌలింగ్ కు పనికిరాడంటూ విమర్శలను ఎదుర్కొంటోన్న వేళ.. లక్నో సూపర్ జెయింట్స్ పై జరిగిన మ్యాచ్ లో సత్తా చాటాడు. ఈ ఆల్ రౌండర్ తన తొలి ఓవర్‌లోనే రిషబ్ పంత్‌ను అవుట్ చేసి విమర్శకులకు దీటుగా సమాధానం ఇచ్చాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో బౌలింగ్ చేయనందుకు కామెరాన్ గ్రీన్ అభాసుపాలయ్యాడు.
మ్యాచ్ 9వ ఓవర్‌లో గ్రీన్ వేసిన షార్ట్ బాల్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌ను అవుట్ చేసింది. కీలక వికెట్ ఇది. సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ లైనప్‌కు తీవ్రంగా దెబ్బతీసింది. ఐపీఎల్ వేలంలో అతన్ని రూ. 25.20 కోట్లతో భారీ ధరకు కొనుగోలు చేసింది కోల్ కత నైట్ రైడర్స్. కెకెఆర్ సీజన్ తొలి రెండు మ్యాచ్‌లలో బౌలింగ్ చేయనందుకు విమర్శలు ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్ లోనూ విఫలం అయ్యాడు. తన స్థాయికి తగ్గట్టుగా భారీ ఇన్నింగ్ ఆడలేకపోయాడు.

లక్నో సూపర్ జెయింట్స్ పై జరిగిన మ్యాచ్ లో చెలరేగాడు. తొలుత బ్యాటింగ్ లో, ఆ తర్వాత బౌలింగ్ లో సత్తా చాటాడు. 24 బంతుల్లో ఒక సిక్స్, మూడు ఫోర్లతో 32 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు కామెరాన్ గ్రీన్. ఆ తర్వాత బౌలింగ్ ఒక వికెట్ తీశాడు గానీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రెండు ఓవర్లల్లో ఒక వికెట్ తీసుకుని 28 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ మ్యాచ్ ను కోల్ కత నైట్ రైడర్స్ ఓడిపోయింది. అయినప్పటికీ కామెరాన్ గ్రీన్ బ్యాటింగ్, బౌలింగ్ లో రిథమ్ అందిపుచ్చుకోవడం ఆ జట్టుకు ఉపశమనాన్ని కలిగించినట్టయింది.
వెన్నునొప్పి కారణంగా కామెరాన్ గ్రీన్ టోర్నమెంట్ ప్రారంభ దశలో బౌలింగ్ చేయబోడని కెకెఆర్‌కు ముందే తెలియజేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. అతని వెన్ను కింది భాగంలో గాయమైందని, దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, కొద్దిరోజుల పాటు బౌలింగ్ చేయబోడని తేల్చి చెప్పింది. ఇప్పుడిప్పుడే బంతిని అందుకుంటోన్నాడు గ్రీన్. అతను బౌలింగ్ చేయడం కెకెఆర్‌కు మిడిల్ ఓవర్లలో కలిసి వస్తుంది. బ్యాటర్లపై ఒత్తిడిని తీసుకురావడానికి ఉపయోగపడుతుందని కెకెఆర్ మేనేజ్మెంట్ భావిస్తోంది.












Click it and Unblock the Notifications