షాక్: స్మృతి మంధాన పెళ్లి పెటాకులు- రద్దు చేసుకున్నట్లు ప్రకటన
సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ తో జరగాల్సిన వివాహం నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో క్రికెటర్ స్మృతి మంధాన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెహందీ, హల్దీ ఫంక్షన్, పెళ్లి ఫొటోలన్నింటినీ కూడా ఇదివరకే డిలెట్ చేశారు. పెళ్లి పీటలు ఎక్కడానికి రెండు గంటల ముందు మంధాన తండ్రి శ్రీనివాస్ గుండెపోటుకు గురి కావడం, వెంటనే ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సి రావడం వంటి కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోయింది.
తాజాగా ఈ పెళ్లి పెటాకులైంది. పలాష్ ముచ్చల్ తో జరగాల్సిన పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు స్మృతి మంధాన తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీనిపై ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలకు ముగింపు పలకాలని కోరారు. పెళ్లి రద్దు చేసుకోవడానికి గల కారణాలను స్మృతి మంధాన వివరించలేదు. తనకు ప్రైవసీ కావాలని చెప్పారు.

2019 నుండి ప్రేమలో ఉన్నారు స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్. ఈ జంట.. పెళ్లి పీటలు ఎక్కడం, మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావడమే ఆలస్యం అనుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా తన జీవితంపై చాలా ఊహాగానాలు వచ్చాయని, ఈ సమయంలో మాట్లాడటం చాలా ముఖ్యం అని అనిపించిందని చెప్పారు. ప్రైవసీని కోరుకునే మహిళనని, అలాగే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.
అన్ని ఊహాగానాలకు తెర దించాలనే ఉద్దేశంతోనే పెళ్లి రద్దయిందనే విషయాన్ని అధికారికంగా తెలియజేస్తోన్నానని అన్నారు. పెళ్లిపై జరిగిన చర్చలు మానసిక వేదనను కలిగించాయని మంధాన స్పష్టం చేశారు. ఇప్పటికైనా కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నానని, మీరందరూ కూడా అలాగే చేయాలని కోరుతున్నానని కోరారు. దయచేసి ఈ సమయంలో రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించి, ముందుకు సాగడానికి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.
క్రికెట్ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే తన దీర్ఘకాలిక లక్ష్యమని, ఈ అంకితభావం చెక్కుచెదరలేదని మంధాన తెలిపారు. వీలైనంత కాలం భారత్ కోసం ఆడటం, ట్రోఫీలు గెలవడం కొనసాగించాలని ఆశిస్తున్నానని, తన దృష్టి దీనిపైనే ఉంటుందని తేల్చి చెప్పారు. ఎటువంటి ప్రతికూల ప్రభావాలు తన ఆటపై ప్రభావం చూపబోవని, రెట్టించిన ఉత్సాహంతో దేశం తరఫున క్రికెట్ ఆడతానని అన్నారు. ఇందులో రాజీపడబోనని, ప్రైవసీకి అవకాశం ఇవ్వాలని పదేపదే కోరారు.












Click it and Unblock the Notifications