ఇతగాడి తేడా బౌలింగ్ ను మనోళ్లు ఎలా ఫేస్ చేస్తారో.. పాకిస్తాన్ మిస్టరీ బౌలర్
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ పై నెలకొన్న ఉత్కంఠతకు తెర పడింది. మొన్నటిదాకా బెట్టు చేసిన పాకిస్తాన్ మెట్టు దిగింది. ఐసీసీ ఇచ్చిన ధమ్కీ కి బెదిరిపోయింది. ఈ మ్యాచ్ ఆడకపోతే భారీగా పెనాల్టీ విధించాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది ఐసీసీ. దీని దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. భారత్ తో మ్యాచ్ ఆడటానికి అంగీకరించింది. దీంతో ఈ నెల 15వ తేదీన కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ ఆర్క్ రైవల్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ లో బౌలర్ ఉస్మాన్ తారిఖ్ ను నమ్ముకుంది పాకిస్తాన్. టీ20 ప్రపంచకప్‌లో అమెరికాపై మ్యాచ్ విజయాన్ని అందించాడీ స్పిన్ బౌలర్. అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించాడు. అతని అసాధారణ బౌలింగ్ 'చకింగ్' చర్చలకు దారితీసింది గానీ.. ఐసీసీ నిర్వహించిన బయోమెకానికల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అతని బౌలింగ్ యాక్షన్ చట్టబద్ధమని తేలింది. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల ఈ ఎక్స్-ఫాక్టర్.. పాకిస్తాన్ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడనే అంచనాలు ఉన్నాయి.

ఎంఎస్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా అతన్ని క్రికెట్ వైపు నడిపించింది. ధోనీ స్ఫూర్తితో.. క్రికెట్ లో అడుగు పెట్టాడు. క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకోవడం అతని కెరీర్‌లో కీలక మలుపు. సెలెక్టర్ల దృష్టికి రాకముందే అతని అసాధారణ బౌలింగ్ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. అతని బౌలింగ్ వైవిధ్యమే క్లబ్, లీగ్ అవకాశాలను తెచ్చిపెట్టింది. ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడి నైపుణ్యానికి మరింత పదును పెట్టుకున్న తారిఖ్, బలమైన బ్యాటింగ్ లైనప్‌లను ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయికి వేగంగా చేరుకున్నాడు.
తారిఖ్ బౌలింగ్ యాక్షన్ ప్రత్యేకతే.. అతనిపై అందరి చూపూ తిప్పుకొనేలా చేసింది. క్రీజ్ వద్ద ఆగి, స్లింగీ మోషన్‌తో బంతిని వేస్తాడు. స్లో మోషన్‌లో ఇది నాటకీయంగా కనిపిస్తుంది. బయోమెకానికల్ నిబంధనలకు లోబడి ఉన్నా గానీ చూడ్డానికి చకింగ్ లా కనిపిస్తుంది. ఐసీసీ నిర్వహించిన బయోమెకానికల్ అసెస్మెంట్ లో అతను ఉత్తీర్ణత సాధించాడు.
టీ20 ఇంటర్నేషనల్స్ పై మంచి ట్రాక్ రికార్డు ఉంది తారిఖ్ కు. డబుల్ డిజిట్ వికెట్లు, అద్భుతమైన ఎకానమీ రేట్‌తో మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు తీయగల అతని నైపుణ్యం అతనికి ఉంది. టీ20 ప్రపంచకప్‌లో అమెరికాపై మూడు వికెట్లు పడగొట్టాడు. ఒత్తిడిలోనూ తారిఖ్ ప్రశాంతంగా, ప్రభావవంతంగా రాణించగలడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కితాబిస్తోన్నారు. అతడి బౌలింగ్ యాక్షన్ బ్యాటర్లను కొంత తికమకకు గురి చేస్తుందని, ఇది ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications