కేన్ విలియమ్సన్ వారసుడి ఎంపిక- ఆచితూచి
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు అత్యంత కీలక సమయంలో ఏర్పడ్డ శూన్యతను భర్తీ చేయడానికి ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేయడానికి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జాప్యం చేయట్లేదు. ఇంగ్లాండ్‌తో జరగబోయే మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం విల్ యంగ్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందటే అధికారికంగా వెల్లడించింది.
శుక్రవారం నాడే కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ సైతం ఆయనను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూర్వకంగా విషెస్ తెలియజేశాడు. విలియమ్సన్ లేకపోవడం కివీస్ జట్టుకు పెద్ద లోటే అయినప్పటికీ, ప్రస్తుత పర్యటనలో నిలదొక్కుకునేందుకు సిద్ధమవుతోంది. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో మొదటి టెస్టులో న్యూజిలాండ్ 115 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

ఈ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో విల్ యంగ్ ను ఎంపిక చేసింది బోర్డ్. దీంతో సోమవారం అతను ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నాడు. రెండో టెస్ట్ మ్యాచ్ నాటికి జట్టుతో కలవనున్నాడు. ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 17వ తేదీన ప్రారంభం కానుంది. ఓవల్ దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. తొలి టెస్ట్ లో ఎదురైన పరాభవాన్ని అధిగమించాలనే పట్టుదలతో బ్లాక్‌క్యాప్స్ బరిలోకి దిగుతోంది.
A big welcome to Will Young, who joins the squad tomorrow as the team continues their prep for the second test against England starting this Wednesday 17 June.#ENGvNZ pic.twitter.com/Hd0EWsNPKi
— BLACKCAPS (@BLACKCAPS) June 13, 2026
ఈ ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఎక్స్ ద్వారా వెల్లడించింది. కేన్ విలియమ్సన్ స్థానంలో ఇంగ్లాండ్‌తో జరిగే మిగిలిన రెండు టెస్టుల కోసం సెంట్రల్ స్టాగ్స్ బ్యాటర్ విల్ యంగ్‌ను టెస్ట్ జట్టులోకి తీసుకునట్లు తెలిపింది. ఇంగ్లాండ్ పర్యటనలో సిరీస్‌ను కాపాడుకోవాలంటే కివీస్ జట్టుకు రాబోయే మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. తొలి టెస్టు పరాజయం నుంచి త్వరగా కోలుకుని, లార్డ్స్ మైదానంలో ఎదురైన పరాభవానికి ఓవల్ వేదికగా ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది.












Click it and Unblock the Notifications