టిడిపిలో ఇం'టి' పోరు: కిరణ్ బెదురు బాబులో

అవిశ్వాసంపై బాబులో భయం కనిపిస్తుండగా.. ముఖ్యమంత్రిలో మాత్రం ఆ బెరుకు ఏమాత్రం కనిపించడం లేదంటున్నారు. జగన్ పార్టీ, తెలుగుదేశం, తెరాస, మజ్లిస్.. ఎలా ఏ పార్టీ అవిశ్వాసం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా కిరణ్‌లో ఏమాత్రం తొట్రుపాటు కనిపించడం లేదు. పైగా ఎన్నాళ్లు పదవిలో ఉంటామన్నది ముఖ్యం కాదని, ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమని, భయంతో బతకలేమని ఆయన చెబుతున్నారు. పదవులు శాశ్వతం కాదని చెబుతున్న కిరణ్ అవిశ్వాసం డోంట్ కేర్ అంటున్నారు.
అయితే బాబుకు మాత్రం అవిశ్వాసం భయం పట్టుకుందని అంటున్నారు. ముఖ్యమంత్రి అవిశ్వాసాన్ని లెక్కచేయక పోవడం వెనుక అధిష్టానం చూసుకుంటుందనో లేక ఉన్నంత కాలం తన పని తాను చేసుకు పోవాలనే భావనో ఉందని అంటున్నారు. మరోవైపు తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో బాబులో అవిశ్వాసం బెరుకు కనిపిస్తోందని చెబుతున్నారు. అఖిల పక్ష సమావేశంలో టిడిపి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది.
దీంతో సమైక్యవాదులు టిడిపిపై మండిపడుతున్నారు. మరోవైపు లేఖలో స్పష్టత లేదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. ఇలా రెండు వైపుల ఎదురు దాడి ఎదుర్కొంటున్న బాబు వచ్చే సమావేశాల్లో అవిశ్వాసాన్ని కూడా ఎదుర్కోల్సి ఉంటుందంటున్నారు! టిడిపిలోని కొందరు తెలంగాణ నేతలు సమావేశాల్లో అవిశ్వాసానికి సై అంటున్నారట. అధిష్టానంపై గుర్రుగా ఉన్న తెలంగాణ కాంగ్రెసు నేతలు తెరాస, బిజెపి, సిపిఐ వంటి వాటితో కలిసి అవిశ్వాసం పెడితే తెలంగాణ టిడిపి నేతలు ఖచ్చితంగా మద్దతు పలకాల్సి ఉంటుంది.
ఇదే భయం ఇప్పుడు బాబును పట్టుకుందని అంటున్నారు. సమావేశాల్లో అవిశ్వాసం పెడితే ఏం చేయాలో బాబు తేల్చుకోలేక పోతున్నారని అంటున్నారు. అవిశ్వాసం వరకు వచ్చే ఛాన్సే లేదని మరికొందరు నేతలు కొట్టి పారేస్తున్నారట. మరోవైపు తెలంగాణ ప్రాంత టిడిపి నేతలు కూడా తెలంగాణ కోసం రాజీనామాలకు తెరదీసే అవకాశాలు ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది కూడా బాబుకు ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications