ఏపీకి విభజన హామీలపై ఆత్మరక్షణలో బీజేపీ.. పార్లమెంట్ బయట నిధులు కేటాయిస్తామని మరోసారి హామీలు ఇలా

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

అమరావతి/ హైదరాబాద్: గతంలో ఏరు దాటే వరకు ఓడమల్లయ్య.. ఆ తర్వాత బోడి మల్లయ్య.. అనే నానుడి ఉండేది.. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిగ్గా సరిపోతుందా? అనిపిస్తున్నది. 10 ఏళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014 ఎన్నికల్లో తిరుమల తిరుపతి శ్రీనివాసుడి సాక్షిగా వాగ్దానం చేసిన ప్రస్తుత ప్రధాని, అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. దాని స్థానే ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రకటన చేసి ఏడాదిన్నర దాటినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.
ఈ పరిణామాలన్నింటితో కాలం ఆగదుగా దాని మానాన అది వెళ్లిపోతూనే ఉన్నది. మరో ఏడాదిలో లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ జమిలి ఎన్నికలు దూసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక హోదా కల్పిస్తే బీజేపీకి మద్దతునిస్తామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంకేతాలతో అధికార టీడీపీలోనూ 'కాక' పుట్టింది.

టీడీపీ నిరసనతో ఆత్మరక్షణలో పడిన బీజేపీ

టీడీపీ నిరసనతో ఆత్మరక్షణలో పడిన బీజేపీ

2018 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నుంచి టీడీపీ తమకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల అమలు సంగతి తేల్చండంటూ పార్లమెంట్ లోపల, బయటా నిరసన తెలుపడం అధికార బీజేపీ ఆత్మరక్షణలో పడింది. వారం.. పది రోజుల్లో రెండు మూడు సార్లు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విత్త మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ‘కొత్త సీసాలో పాత సారా' అన్న చందంగానే ఉన్నదే తప్ప.. నిధుల కేటాయింపు ఊసే లేదు.

చట్టబద్ధ హామీలకు సిద్ధంగా లేని కేంద్రం

చట్టబద్ధ హామీలకు సిద్ధంగా లేని కేంద్రం

తీరా బడ్జెట్ తొలి దశ పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కేంద్ర మంత్రి సుజనాచౌదరి, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌లతో జరిగిన చర్చల్లో నిధుల కేటాయింపుల్లో సరైన విధంగా వ్యవహరించలేదని విత్త మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా చెప్పారు. పార్లమెంట్‌ నియమ నిబంధనలకు లోబడి ఈ ప్రకటనలేవీ సభలో ప్రస్తావించలేదని జైట్లీ చెప్పినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అంటే ఆంధ్రులను మరోసారి కమలనాథులు మోసగించేందుకు పూనుకున్నారా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై పార్లమెంట్ వేదికగా ప్రకటన చేయడంలో ఇబ్బందేమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతున్నది.

పార్లమెంట్ లో బీజేపీ ప్రశ్నలకు కేంద్ర మంత్రులు చిదంబరం, ప్రణబ్ ఇలా జవాబు

పార్లమెంట్ లో బీజేపీ ప్రశ్నలకు కేంద్ర మంత్రులు చిదంబరం, ప్రణబ్ ఇలా జవాబు

ఈ సమయంలో ఒక సంగతి గుర్తుకొస్తున్నది. నాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. రాష్ట్ర సాధన కోసం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఉపసంహరించేందుకు కేంద్ర హోంమంత్రి పీ చిదంబరం 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీన మీడియా ముందుకు వచ్చి ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ' ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. దీనిపై మరుసటి రోజు లోక్‌సభలో బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, నాటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్.. హోంమంత్రి చిదంబరాన్ని నిలదీశారు. ఎప్పటిలోగా తెలంగాణ ఏర్పాటవుతుందని ప్రశ్నించడంతో తదనుగుణంగా హోంమంత్రి చిదంబరం, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా తెలంగాణ ఏర్పాటుకు చట్టబద్ధంగా తాము సిద్ధమని హామీ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ విభజన దాదాపు నాడే ఖరారై పోయింది.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పనపై నాటి ప్రధాని మన్మోహన్ ఇలా

ఏపీకి ప్రత్యేక హోదా కల్పనపై నాటి ప్రధాని మన్మోహన్ ఇలా

తర్వాత సీమాంధ్రలో ఆందోళనలు.. టీడీపీ, కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల లాబీయింగ్ తదితర కారణాల రీత్యా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ 2014 వరకు వాయిదా పడి ఉండవచ్చు గానీ అనివార్యమైంది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరిగినప్పుడు కూడా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని వ్రాత పూర్వక ప్రకటన చేశారు. ఇది సరిపోదని, పదేళ్లు కావాలని నాటి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా.. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు డిమాండ్ చేసిన సంగతి తెలుగు వారెవ్వరూ విస్మరించలేదు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎందులోనైనా ప్రధాని రాతపూర్వక ప్రకటన చేస్తే అది చట్టబద్ధమే. కానీ నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సంగతి విస్మరించింది.

రూ.16 వేల కోట్ల లోటుపై నివేదిస్తే వచ్చింది రూ.3950 కోట్లే

రూ.16 వేల కోట్ల లోటుపై నివేదిస్తే వచ్చింది రూ.3950 కోట్లే

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాటవేత యత్నాల ఫలితంగానే ఈనాడు నేడు ఆంధ్రావని అంతటా నిరసనల జ్వాల వెల్లువెత్తుతున్నది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో మరికొన్ని తప్పిదాలకు పాల్పడుతున్నారు కమలనాథులు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో రూ.16 వేల కోట్ల లోటు ఉన్నదని కేంద్రానికి ఏపీ సర్కార్ నివేదిక పంపింది. కానీ కేంద్రం ఇప్పటి వరకు విదిల్చింది కేవలం రూ.3,950కోట్లు మాత్రమే. అదే ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌కు మాత్రం ఇందుకు భిన్నంగా ఏటా రూ.8వేల కోట్లు అందచేస్తూ వస్తున్నది. హిమాచల్‌ ప్రభుత్వం కొన్నేళ్లుగా రూ.45వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఆ రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద ఏటా రూ.8000కోట్లు సమకూరుస్తోంది.

రాయలసీమకు బుందుల్ ఖండ్ ప్యాకేజీపై మన్మోహన్ ప్రకటన

రాయలసీమకు బుందుల్ ఖండ్ ప్యాకేజీపై మన్మోహన్ ప్రకటన

ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన ఏడు జిల్లాలకు ఒడిశాలోని కోరాపుట్‌ - బోలంగిర్‌ - కలహండి తరహాలో స్పెషల్‌ ప్లాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లోని బుందేల్‌ఖండ్‌ తరహా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారు. కేబీకే, బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీల్లో రూ.6వేల కోట్లు ఇస్తే.. ఏపీలో వెనుకబడిన జిల్లాల ప్రగతికి రూ.1050కోట్లు మాత్రమే ఇచ్చారు. 2014-15లో 14వ ఆర్థికసంఘం నిబంధనల ప్రకారం 10 నెలల కాలానికి రాష్ట్రానికి రావాల్సిన మొత్తం వెంటనే ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మూడేళ్ల మొత్తం బకాయి కూడా ఒకేసారి విడుదల చేసేందుకు బీజేపీ అంగీకరించినట్లు సమాచారం.

ఏ క్షణంలోనైనా విశాఖ రైల్వే జోన్ ప్రకటన ఖాయం?

ఏ క్షణంలోనైనా విశాఖ రైల్వే జోన్ ప్రకటన ఖాయం?

ఏపీ అంశాలపై పరిష్కారానికి కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో సుజనా చౌదరి సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు చర్చించారు. అమ‌రావ‌తి నిర్మాణానికి చేసిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను అంద‌జేస్తే నిధులు ఇస్తామ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. హోదావ‌ల్ల వ‌చ్చే నిధుల‌ను ఒకేసారి ఇచ్చేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తంచేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌కారం ఈఏపీ నిధుల స‌ర్దుబాటుకు సిద్ధంగా ఉన్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఏ నిమిషంలోనైనా రైల్వేజోన్‌ ప్రకటించాలని రైల్వే మంత్రి పీయూష్‌ గోయాల్‌ను అరుణ్‌జైట్లీ ఆదేశించిన‌ట్టు స‌మాచారం. దుగరాజపట్నం పోర్టు విషయంలో రక్షణ పరమైన ఇబ్బందుల ఉన్న దృష్యా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, ఆ పోర్టును రాష్ట్ర ప్రభుత్వం చూపిన ప్రదేశంలో నిర్మించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తంచేసింది. దీనికి నిధులు విడుదల చేయడంతో పాటు అన్ని అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. పెట్రోకెమిక‌ల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సైతం ఆదేశాలు పంపిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యంతో క‌డ‌ప ఉక్కుక‌ర్మాగారం నిర్మిస్తామ‌ని కేంద్రం చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మెకాన్ సంస్థ ఈ నెల 12న నివేదిక అందించ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది.

ఏపీ నిధుల కేటాయింపుపై బీజేపీ డొల్లతనం ఇలా

ఏపీ నిధుల కేటాయింపుపై బీజేపీ డొల్లతనం ఇలా

ఇదిలా ఉంటే టీడీపీ ఆందోళనకు కాంగ్రెస్.. ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం మద్దతు తెలుపడంతో బీజేపీ ఇరుకున పడింది. గత మూడున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తామిచ్చిన నిధుల వివరాలను వెల్లడించిన బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు హరిబాబు.. తమ డొల్లతనాన్ని బయట పెట్టుకున్నారు. ఐదేళ్లకు రెవెన్యూ లోటు దాదాపు రూ.20వేల కోట్లు వస్తుందని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని హరిబాబు చెప్పారు. ఆర్థిక సంఘం సిఫారసుకు అనుగుణంగా రూ.4వేల కోట్లు ఇప్పటికే కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఇంకా ఎంత ఇవ్వాలనే దానిపై ఒక అంగీకారం కోసం ప్రయత్నం జరుగుతోందని సెలవిచ్చారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6వేల కోట్లు లోటు ఉంటుందని ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. దాని నిధుల విడుదలకు పరస్పర అంగీకారంతో నిధులు మంజూరు చేస్తామని బీజేపీ విశాఖపట్నం ఎంపి హరిబాబు పేర్కొన్నారు. 10 నెలల రెవెన్యూ లోటును త్వరలో భర్తీ చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు.

14వ ఆర్థిక సంఘం సిఫారసుల పేరిట దాటవేసేందుకు బీజేపీ యత్నాలు

14వ ఆర్థిక సంఘం సిఫారసుల పేరిట దాటవేసేందుకు బీజేపీ యత్నాలు

వాస్తవంగా ఏపీకి రూ.17 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటుందని దాన్ని ఐదేళ్ల పాటు కేంద్రమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టంలో చేర్చిన సంగతి హరిబాబు విస్మరించారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సంగతి పక్కనబెట్టినా.. ఆర్థిక సంఘం సిఫారసుల అమలు చేయాలన్నా ఏయేటికాయేడు నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ అదేమీ చేయకుండా ఏపీ చట్టం అమలుకు పదేళ్ల గడువు ఇచ్చినందున అప్పటి వరకు చర్యలు తీసుకుంటామని చెప్పడంలో అంతరార్థమేమిటో హరిబాబు మాత్రమే సెలవియ్యాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఏపీలో టీడీపీ నేతల తీరు తాము తప్ప మరొకరు రాజకీయంగా లబ్ధి పొందకూడదన్న అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. ప్రత్యేక హోదాతోపాటు చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు జేఏసీ ఏర్పాటు అవసరమన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనను విజయవాడ ఎంపీ కేశినేని నాని తప్పుబట్టడంలో అంతరార్థమిదేనని అంటున్నారు. అంతా ఏకోన్ముఖంగా ఆందోళనకు దిగితేనే పట్టించుకునే వారు ఉండరు. కానీ కేవలం ఏపీ సీఎం చంద్రబాబు జరిపే పోరాటానికి మద్దతు తెలిపితే మాత్రం సరిపోతుందని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి చేటు తెస్తాయన్న సంగతి విస్మరిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP self defence funds allocation to Andhra Pradesh as per AP re organisation act. Then AP re organisation act says after Telangana division Andhra Pradesh will be faces that deficet Rs. 17 thousand crores.But Narendra Modi Government didn't fullfill any assurance.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి