సచిన్ భవిష్యత్తు: ఏం చేస్తాడు, రాజకీయాలా?
ముంబై: అంతర్జాకీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇక ఏం చేస్తాడనేది చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన రాజకీయాల్లోకి వెళ్తాడా అనేది కూడా ప్రధాన చర్చనీయాంశంగానే ఉంది. క్రికెట్ లేని సచిన్‌ను ఊహించుకోలేమని ఆయన భార్య అంజలి అన్నారు. దీన్నిబట్టి ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను క్రికెట్‌తోనే మరో రూపంలో ముడివేసుకుంటాడా అనేది కూడా ప్రశ్న.
సచిన్ టెండూల్కర్ కాంగ్రెసు తరఫున ఎన్నికల్లో ప్రచారం చేస్తాడనే ప్రచారం కూడా సాగింది. ఆ ప్రచారంపై సచిన్ టెండూల్కర్ నోరు విప్పలేదు. కానీ, బిసిసిఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజీవ్ శుక్లా ఆ విషయంపై స్పష్టత ఇచ్చారు. సచిన్ టెండూల్కర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోరని చెప్పారు. సచిన్ టెండూల్కర్‌ను తమకు అనుకూలంగా వాడుకోవాలని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భావించినట్లు చెబుతారు. సచిన్ టెండూల్కర్ ఆడిన చివరి టెస్టు మ్యాచును ఆయన గ్యాలరీలో కూర్చుని వీక్షించారు కూడా.

సచిన్ టెండూల్కర్‌కు మాత్రం రాజకీయాల పట్ల ఆసక్తి లేదని అంటున్నారు. రాజకీయాలకు సంబంధించినంత వరకు తటస్థంగానే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీ తనను రాజ్యసభకు నామినేట్ చేయించినప్పటికీ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి సిద్ధంగా లేరని సమాచారం. ఇదే విషయాన్ని రాజీవ్ శుక్లా రాహుల్ గాంధీకి చెప్పినట్లు సమాచారం.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/CfCBWUkWzXM?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
భవిష్యత్తుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పడానికి తనకు కనీసం 24 గంటలు సమయం ఇవ్వాలని సచిన్ టెండూల్కర్ అన్నారు. టెండూల్కర్ మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయట. రాజ్యసభ సభ్యుడిగా క్రియాశీలకంగా పనిచేయాలనేది కూడా అందులో ఒక్కటని అంటున్నారు. అయితే, క్రియాశీలక రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉంటాడని చెబుతున్నారు. మంత్రి పదవిని చేపట్టడానికి కూడా ఆయన సిద్ధంగా లేరని చెబుతున్నారు.
టెండూల్కర్ భారతదేశంలోని వివిధ క్రికెట్ జట్లతో, క్రికెటర్లతో అనుబంధాన్ని పెంచుకుని, వారికి అవసరమైన నైపుణ్యాలను నేర్పే బాధ్యతను తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, దానికి ఎలా రూపం ఇస్తారు, బిసిసిఐ అందుకు ఏ విధమైన సహకారం అందిస్తుంది, బిసిసిఐ ఆయనను ఏ విధమైన స్థానంలో నిలబెడుతుందనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications