ఎవరి మీద వార్?: పవన్ సభకు తిరుపతే ఎందుకు?
తిరుపతి : 2014 ఎన్నికలకు ముందు జనసేన పేరుతో.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన పవన్ కళ్యాణ్.. అప్పటి ఎన్నికల్లో టీడీపీకి బీజేపీకి మద్దతు పలకడం మినహా మళ్లీ ఇంతదాకా పార్టీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా అభిమాని హత్య తర్వాత పవన్ కళ్యాణ్ ఓ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండడంతో.. క్రియాశీలక రాజకీయాల్లో ఆయన యాక్టివ్ అవబోతున్నారా..? లేక కేవలం అభిమానుల అంశానికే సభా ప్రసంగాన్ని పరిమితం చేస్తారా..? అన్నది ప్రస్తుతం అందరి మదిలో మెదులుతోన్న ప్రశ్న.
తిరుపతినే ఎందుకు ఎంచుకున్నారు?
రాజకీయంగా సొంత పార్టీ పెట్టినప్పటికీ.. ఇప్పటిదాకా దాని బలోపేతం దిశగా గానీ, భవిష్యత్తు కార్యాచరణ దిశగా గానీ పవన్ ఇంతవరకు ఎలాంటి ముందడుగు వేయలేదు. అభిమాని హత్యతో.. మళ్లీ తెరపైకి వచ్చిన పవన్ రాజకీయాలు.. భవిష్యత్తు రాజకీయాలను శాసించేవిగా ఉంటాయా..! లేక మునుపటి లాగే స్పీచులకే పరిమితమా..! అన్నది నేటితో తేలిపోనుంది.

ఇక వీటన్నింటిని పక్కనబెడితే.. పవన్ ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగే యోచనలో ఉన్నారు కాబట్టే.. తిరుపతిని టార్గెట్ చేసుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన జనాభా లెక్కలను, సామాజిక సమీకరణలను, ఓటర్ల సంఖ్య వంటి అంశాలపై పవన్ ప్రత్యేకంగా ఫోకస్ చేయడం.. ఆయన భవిష్యత్తు ఎన్నికల వ్యూహంలో భాగమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తిరుపతి నుంచి పోటీ చేసే ఉద్దేశం ఉంది కాబట్టే.. తిరుపతి సభ ద్వారానే తన రాజకీయాలను పదునుపెట్టాలనే భావనలో పవన్ ఉన్నారని అటు అభిమానులు కూడా భావిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, చిరంజీవిలు కూడా తిరుపతి నుంచే రాజకీయ ఆరంగ్రేటం చేసిన నేపథ్యంలో.. పవన్ కూడా అదే బాటలో పయనించనున్నారనేది మరో వాదన.
ఇకపోతే తాజా బహిరంగ సభలో.. ప్రభుత్వాన్ని పవన్ టార్గెట్ చేస్తారా? హోదా అంశాలను ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని నిలదీస్తారా..? అన్న అంశాలు కూడా ఆసక్తికరంగా మారాయి. అటు అభిమాని హత్య కుల కోణంలో జరిగిందన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి కాబట్టి.. సామాజిక అంశాలపై పవన్ ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరం. ప్రసంగించిన ప్రతీసారి యుద్దం ప్రకటించినంత ఆవేశంగా ప్రసంగించే పవన్.. ఈసారి ఎవరి మీద వార్ ప్రకటిస్తారన్నది మరింతగా చర్చలకు తావిస్తోన్న అంశం.
ఏదైమైనా.. నేటి పవన్ సభ విమర్శకుల నోటికి పని చెప్పేలా ఉంటుందా..? లేక అభిమానులతో పాటు సామాన్య ప్రజానీకాన్ని కూడా మెప్పించేలా ఉంటుందా? అన్నది ఈ సాయంత్రానికి తేటతెల్లం కానుంది.












Click it and Unblock the Notifications