వామ్మో.. మెటాలో ఉద్యోగం నరకప్రాయం- రూ. లక్షల్లో జీతాన్ని వదిలిపెట్టి పరుగో పరుగు
సర్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మయం అవుతున్న ప్రస్తుత పరస్థితుల్లో మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన సొంత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగం మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ లో భారీ ప్రక్షాళనకు తెర తీశారు. పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఈ క్రమంలో ఈ డివిజన్ లో పెద్ద ఎత్తున లేఆఫ్స్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.
ఇటీవలే మిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించి AI ఇంజనీర్లను నియమించింది మెటా. ఇప్పుడు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. ఉద్యోగుల తొలగింపులను చేపట్టాలని నిర్ణయించింది. జీపీటీ-5 ఆవిష్కరణ చోటు చేసుకున్న కొద్ది రోజులకే ఈ పరిణామం సంభవించడం కాకతాళీయంగానే చెప్పుకోవచ్చు. ఫలితంగా- AI బూమ్ తగ్గుతోందనే ఊహాగానాలకు దారితీసింది.

ఈ పరిస్థితుల మధ్య సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ నుంచి AI సైంటిస్టులు వైదొలగుతున్నారు. తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తోన్నారు. ఇప్పటివరకు ఎనిమిది సీనియర్ లెవెల్ సైంటిస్టులు రాజీనామా చేయడం కలకలం రేపింది. మున్ముందు ఇది కొనసాగవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఈ ల్యాబ్ లో చేరిన అయిదు నెలలకే AI రీసెర్చర్ రిషభ్ అగర్వాల్ రాజీనామా చేయడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లో అతను మిలియన్ డాలర్ల ప్యాకేజీతో ఇందులో జాయిన్ అయ్యాడు. అందులో ఎక్కువ రోజులు కొనసాగలేకపోయాడు. వేరే రకమైన రిస్క్ తీసుకోవాల్సి ఉండటం వల్ల మెటా నుంచి తప్పుకొంటోన్నట్లు ప్రకటించాడు.
తన రాజీనామాకు గల కారణాలను ఎక్స్ ద్వారా వెల్లడించాడు రిషభ్ అగర్వాల్. మెటాలో ఇదే తన చివరి వారం అని తెలిపాడు. సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌తో కొనసాగకూడదనే నిర్ణయం కష్టమే అయినప్పటికీ తప్పట్లేదని, వేరే రకమైన రిస్క్ తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించాడు. సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ లో ఉన్న టాలెంట్, కంప్యూట్ డెన్సిటీని చూస్తోంటే వదలాలనిపించట్లేదని చెప్పుకొచ్చాడు.
మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్ నుండి అగర్వాల్ నిష్క్రమించడం ఖాయమైన నేపథ్యంలో రిషభ్ అగర్వాల్ తదుపరి అడుగు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరావట్లేదు. అతను మరే ఇతర సంస్థలో చేరుతున్నాడా? సొంతంగా ఏదైనా స్టార్టప్ ప్రారంభిస్తున్నాడా? అనేది వెల్లడించలేదు.
రిషభ్ అగర్వాల్ తర్వాత మరో ఏఐ సైంటిస్ట్ అవి వర్మ కూడా మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కు రాజీనామా చేశాడు. అతను ఓపెన్ ఏఐలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిషబ్ అగర్వాల్, ఈథన్ నైట్ తర్వాత మెటా నుండి బయటికొచ్చిన మూడో సైంటిస్ట్.. అవి వర్మ. మిలియన్ డాలర్ల జీతంతో ఏడాది కిందట ఈ ల్యాబ్ లో చేరాడు.
అవి వర్మ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం చూస్తే అతను స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నాడు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అందుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ అతని స్పెషలైజేషన్. అదే యూనివర్శిటీలో రీసెర్చ్ ఇంటర్న్‌గా కూడా కొంతకాలం పాటు పనిచేశాడు.
గత ఏడాది జూన్‌లో ఓపెన్ ఏఐలో చేరాడు అవి వర్మ. ఆ తర్వాత మార్క్ జుకర్‌బర్గ్ ఇచ్చిన భారీ ఆఫర్‌ను అందుకున్నాడు. సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ లో ఏఐ సైంటిస్ట్ గా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు దీనికి గుడ్ బై చెప్పాడు. తిరిగి ఓపెన్ ఏఐకి వెళ్లినట్లు వార్తలు వస్తోన్నాయి.
మెటాకు ముందు- అవి వర్మ ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లాలో దాదాపు నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. 2020 అక్టోబర్ లో ఇంటర్న్‌గా చేరాడు. అనంతరం సీనియర్ మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ స్థాయికి ఎదిగాడు. గత ఏడాది జూన్ లో టెస్లా నుంచి బయటికొచ్చి, ఓపెన్ ఏఐలో చేరాడు.












Click it and Unblock the Notifications