Meta AI : వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ యూజర్లకు మెటా షాక్..!
మార్క్ జుకర్ బర్గ్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా, మెసెంజర్ లలో యూజర్ల భద్రతపై ఇప్పటికే ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ప్లాట్ ఫామ్స్ లో యూజర్ల పోస్టులు, వీడియోలపై నిఘా పెట్టబోతోంది. అయితే ఇందుకు మెటా చెబుతున్న కారణం చూస్తుంటే యూజర్లకు చిర్రెత్తుకొచ్చేలా ఉంది.
సోషల్ ప్లాట్ ఫామ్స్ వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, మెసెంజర్ లను మరింత యూజర్ పర్సనల్ గా మార్చేందుకు మెటా సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా ప్లాట్ ఫామ్స్ లలో అకౌంట్ కలిగిన యూజర్ల యాక్టివిటీపై నిఘా పెట్టబోతోంది. ఇందుకోసం మెటా ఏఐని వాడుకోబోతోంది. వీటిలో ఏఐ సాయంతో చేసే చాట్స్, పోస్ట్ లు, రీల్స్, వీడియోలు నేరుగా యూజర్లకు వచ్చే ప్రకటనలను ప్రభావితం చేయబోతోంది.

వినియోగదారుల ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా కంటెంట్, ప్రకటనల్ని అందించేందుకు వీలుగా ఇలా మెటా సాయంతో యూజర్ల ఖాతాల్ని స్కాన్ చేయబోతున్నట్లు మెటా చెబుతోంది. అయితే ఇలా చేయడం వల్ల యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే నేరుగా పెట్టే పోస్టులు, వీడియోలు, చాట్స్ కాకుండా ఏఐ సాయంతో తయారు చేసి పోస్ట్ చేసే కంటెంట్, చాట్స్ ను మాత్రమే ఇది రీడ్ చేస్తుందని సంస్థ చెబుతోంది.

మెటా తాజా నిర్ణయంతో వాట్సాప్, ఇన్ స్టా, మెసెంజర్ లేదా ఫేస్ బుక్ లో మెటా ఏఐని వాడుతుంటే .. మన అభిరుచులకు అనుగుణంగా కంటెంట్, ప్రకటనలు ఇకపై దర్శనమివ్వబోతున్నాయి. ఉదాహరణకు ప్రయాణం, ఆహారం లేదా ఫిట్‌నెస్ గురించి ఛాట్ చేస్తే... ఫీడ్ లో వీటికి సంబంధించిన ప్రకటనలే కనిపిస్తాయి. ఇవి కనిపించకుండా తప్పించుకోవడానికి మరో మార్గం లేదు. కాబట్టి వీటిని భరించాల్సిందే లేకపోతే మెటా ఏఐని వాడటం పూర్తిగా మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications