ఎంప్లాయిస్ కు హ్యాండిచ్చిన టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్
అమెరికాకు చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్ స్కైడాన్స్ (Paramount Skydance).. లేఆఫ్స్ ప్రకటించింది. ఉద్యోగుల్లో దాదాపు 2,000 మందిని తొలగించబోతోంది. ఈ నెల 27వ తేదీ నుండి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇది తొలిదశ కావొచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత కూడా లేఆఫ్స్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని హాలీవుడ్ మూవీ మేగజైన్ వెరైటీ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. లేఆఫ్స్ కు వెళ్లడానికి గల కారణాలను వివరించింది.
ఈ ఏడాది ఆగస్టులో పారామౌంట్ గ్లోబల్‌తో స్కైడాన్స్ మీడియా విలీనమైన విషయం తెలిసిందే. ఆ తర్వాతే పారామౌంట్ స్కైడాన్స్ ఏర్పాడింది. 8.4 బిలియన్ డాలర్ల విలువ చేసే విలీనం ఇది. ఈ ప్రక్రియ పూర్తయిన రెండు నెలల్లోనే లేఆఫ్‌లు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలిదశలో అమెరికాలో ఉద్యోగ కోతలు ఉంటాయని వెరైటీ మేగజైన్ వివరించింది. నవంబర్‌లో కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో లేఆఫ్స్ ఉండొచ్చని అంచనావేసింది.

2024 డిసెంబర్ నాటికి పారామౌంట్‌లో సుమారు 18,600 ఫుల్ టైమ్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు ఉండేవారు. అదనంగా 3,500 మంది ప్రాజెక్ట్ ఆధారిత సిబ్బంది కూడా పని చేసేవారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలకు అనుగుణంగా వెళ్లాలని నిర్ణయించుకుంది పారామౌంట్ స్కైడాన్స్.
ఇందులో భాగంగా ఖర్చులను తగ్గించుకుంటోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులను పెట్టనుంది. వ్యయ నియంత్రణ చర్యలు, విలీనం తర్వాత సంస్థ పునర్నిర్మాణ ప్రయత్నాల మధ్య తాజాగా ఈ తొలగింపుల పర్వం మొదలైంది. గత ఏడాది జులైలో వార్నర్ బ్రదర్స్ మోషన్ పిక్చర్ గ్రూప్ తమ ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తొలగించనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. కంపెనీని రెండు యూనిట్లుగా విభజించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది అప్పట్లో.
అదేవిధంగా- యూనివర్సల్ ఇంటర్నేషనల్ స్టూడియోస్ కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో లండన్ ప్రధాన కార్యాలయంతో పాటు ఆస్ట్రేలియా, లాస్ ఏంజిల్స్‌లోని తమ కేంద్రాల్లో ఉద్యోగ కోతలు అమలు చేసినట్లు డెడ్‌లైన్ నివేదించింది. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, ఎన్‌బిసి న్యూస్ కూడా ఈ నెల ప్రారంభంలో సుమారు 150 మంది ఉద్యోగులను, అంటే దాదాపు ఏడు శాతం మంది సిబ్బందిని తొలగించడం ప్రారంభించింది.












Click it and Unblock the Notifications