చిరంజీవి - బాబీ సినిమాకు అడ్డంకులు... కారణం అదేనా..?
సాధారణంగా చిన్న హీరోల సినిమాలు అంటేనే విడుదల విషయంలో వంద సమస్యలు ఉంటాయి. కానీ ఇండస్ట్రీని శాసించే మెగాస్టార్ చిరంజీవి సినిమా విషయంలో, అది కూడా షూటింగ్ ఇంకా పూర్తిస్థాయిలో జరుపుకోకముందే ఆటంకాలు రావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిరు, దర్శకుడు బాబీ కాంబోలో సెట్స్ పైకి వెళ్లాల్సిన సినిమాకు అడ్డంకి వెంటాడుతోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్న వెంకట్ కె. నారాయణ (కెవిఎన్ ప్రొడక్షన్స్) ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. తమిళ స్టార్ విజయ్‌తో తీసిన 'జన నాయగణ్' సంక్రాంతికే రావాల్సి ఉన్నా, సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడుతూ నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. అటు కన్నడ రాకింగ్ స్టార్ యష్‌తో నిర్మిస్తున్న 'టాక్సిక్' కూడా మార్చిలో విడుదల కావాల్సి ఉండగా, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల జూన్ 4కి వాయిదా పడింది.

యూట్యూబ్ నుంచి తొలగించారు
అంతేకాకుండా, ఇదే సంస్థ నిర్మించిన 'కేడీ' అనే పాన్ ఇండియా మూవీలోని సాంగ్స్, ట్రైలర్ కాపీరైట్ ఇష్యూల వల్ల యూట్యూబ్ నుంచి తొలగించడం నిర్మాతలకు ఊహించని దెబ్బ. వరుసగా వందల కోట్ల బడ్జెట్ సినిమాలు ఇలా ఆగిపోవడంతో, ఆర్థికంగా కెవిఎన్ ప్రొడక్షన్స్ ఒత్తిడిలో పడింది. దీనివల్ల చిరు-బాబీ సినిమా షూటింగ్‌పై ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రాజెక్ట్ విషయంలో కొత్త వ్యూహాన్ని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
కెవిఎన్ సంస్థ పూర్తిగా ఈ సినిమాను నిర్మించడం కష్టమైతే, మరొక పెద్ద నిర్మాణ సంస్థను భాగస్వామిగా తీసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే చిరుకు సన్నిహితుడైన ఒక టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఈ మూవీలో పాక్షికంగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కాకుండా చూడాలని చిరు పట్టుదలతో ఉన్నారు.
త్వరలోనే కొత్త షెడ్యూల్!
మోకాలి సర్జరీ కారణంగా ఇప్పటికే గ్యాప్ తీసుకున్న చిరంజీవి, ఏప్రిల్ 20 నుంచి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ నిర్మాతకు సంబంధించిన సమస్యల వల్ల ఇది కాస్తా సందిగ్ధంలో పడింది. బాబీ అందించిన అద్భుతమైన స్క్రిప్ట్ తో ఈ సినిమాను వెండితెరపై చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ నిర్మాణ సంస్థ సమస్యలన్నీ తొలిగిపోతాయేమో చూడాలి.












Click it and Unblock the Notifications