మహావతార్ నరసింహను తలదన్నే యానిమేటెడ్ మూవీ: రూ. 500 కోట్లు పక్కా
మహావతార్ నరసింహ.. ఇప్పట్లో మరిచిపోలేని సినిమా ఇది. కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టుకున్న ఓ యానిమేటెడ్ ఫిల్మ్. థియేటర్లలో ఓ ఫుల్ లెంగ్త్ యానిమేటెడ్ మూవీ ఈ స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేయడం చాలా చాలా అరుదు. పురాణగాథ భక్త ప్రహ్లాదుడు- హిరణ్యకశిపుడు- నరసింహ స్వామి ఎపిసోడ్ ఆధారంగా 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 300 కోట్లను కలెక్ట్ చేసింది. ప్రేక్షకులు గ్రాఫిక్స్ ఫిదా అయ్యారు.
2025లో ఏడవ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఇది నిలిచింది.. మహావతార్ నరసింహ. 2014 విడుదలైన కోచ్చడయాన్, 2019 నాటి ది లయన్ కింగ్ ను అధిగమించింది. అశ్విన్ కుమార్ తొలిసారి దర్శకత్వం వహించారు. జయపూర్ణ దాస్ కథను సమకూర్చారు. క్లీమ్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. హోంబలే ఫిలిమ్స్ దీన్ని సమర్పించింది. 2024 నవంబర్ 25న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది.

ఈ ఫిల్మ్ ఇచ్చిన భారీ సక్సెస్ తో ఇప్పుడు మరో యానిమేటెడ్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. దీని టైటిల్.. పినాకిన్. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాతలు ఆవిష్కరించారు. ఈ ఏడాది దసరా- దీపావళి పండగ సీజన్ సమయంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన తొలి అధికారిక ప్రకటన ఇదే. ఈ చిత్రం- విధి, విశ్వం, శివతత్వం వంటి అంశాలను ఇతివృత్తంగా తెరకెక్కుతున్నట్లు చెబుతుననారు.
ఓ అద్భుతమైన దృశ్యరూపంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. పినాకిన్ మూవీ దర్శకుడు నితిన్ జీ. ఆయనే రచనను కూడా సమకూర్చారు. ఈ చిత్రానికి కమల్ భారతి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ రూపొందిస్తోంది. హర్ష్ పండిట్, వామన్ రాణే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'పినాకిన్' యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్.. హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. మహావతార్ నరసింహను మించిపోతుందనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications