Job Mela: ఏపీలో ఈ నెల 12న మెగా జాబ్ మేళా-ఎక్కడ, ఎన్ని ఉద్యోగాలో తెలుసా ?
ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది యువతకు వాటి కల్పన కోసం ప్రభుత్వం వివిధ స్ధాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం నేరుగా కాకపోయినా వివిధ రూపాల్లో జాబ్ మేళాల నిర్వహణను ప్రోత్సహిస్తోంది. ఇదే క్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఈనెల 12న ఆయన నియోజకవర్గం బనగానపల్లెలో మెగా జాబ్ మేళా నిర్వహణకు సిద్ధమయ్యారు.
రాయలసీమలోని బనగానపల్లెలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను దృష్టిలో ఉంచుకుని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వివిధ కంపెనీలతో మాట్లాడి ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇటీవల అర్జీల స్వీకరణ కార్యక్రమానికి ఎక్కువగా నిరుద్యోగ యువతీయువకులు తరలి రావడం, వారంతా ఉన్నత విద్యావంతులు అయినప్పటికీ సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక తన దృష్టికి తీసుకురావడంతో వారి కలను నేరవేర్చాలనే తపన, ఆలోచనలలో నుంచి ఈ మెగా జాబ్ మేళా పుట్టిందని ఆయన తెలిపారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిరుద్యోగ యువత కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 12 బీసీ జనార్థన్ రెడ్డి, ఆయన సతీమణి బీసీ ఇందిరమ్మల ఆధ్వర్యంలో బనగానపల్లెలోని నెహ్రూ ఇంగ్లీషు మీడియం స్కూల్ వేదికగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా 30కు పైగా కంపెనీలు బనగానపల్లెకు తరలి వస్తున్నట్లు తెలిపారు. దాదాపుగా 1000 కు పైగా ఉద్యోగాలను ఇందులో భాగంగా భర్తీ చేయబోతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలోని నిరుద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరుతున్నారు.












Click it and Unblock the Notifications