CBSE Exams Revised Schedule: సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు..!
కేంద్ర ప్రాథమిక విద్యాబోర్డు (CBSE) ఈ విద్యాసంవత్సరానికి నిర్వహించే బోర్డు పరీక్షల షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల చేసింది. అయితే ఇందులో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో సదరు మార్పుల్ని వివరిస్తూ ఇవాళ మరో కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది. అలాగే విద్యార్ధులు, తల్లితండ్రులు గందరగోళానికి గురికాకుండా విద్యా సంస్థలు, అధికారులు వారికి కొత్త షెడ్యూల్ లో మార్పులపై సమాచారం అందించాలని సీబీఎస్ఈ బోర్డు ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఏడాది అక్టోబర్ 30న ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 10 వరకు జరగాల్సి ఉంది. అలాగే ఫిబ్రవరి 17 నుండి ఏప్రిల్ 9 వరకు 12వ తరగతికి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అలాగే రెండవ రౌండ్ పరీక్షలు మే 15 నుండి జూన్ 1 వరకు జరుగుతాయని, ఫలితాలు జూలై 15 నాటికి ప్రకటిస్తామని తెలిపింది. తాజాగా వీటిలో మార్పుచేశారు.

మార్చి 3న జరగాల్సిన 10వ తరగతి 13 సబ్జెక్టులు, 12వ తరగతి ఒక సబ్జెక్టుకు సంబంధించిన బోర్డు పరీక్షలను పరిపాలనా కారణాలతో రీషెడ్యూల్ చేసినట్లు సీబీఎస్ఈ తెలిపింది. 10వ తరగతి టిబెటన్, జర్మన్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, భోటి, బోడో, తంగ్ఖుల్, జపనీస్, భూటియా, స్పానిష్, కాశ్మీరీ, మిజో, బహాసా మెలయు, ఎలిమెంట్స్ ఆఫ్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ పరీక్షల్ని 2026 మార్చి 11న నిర్వహిస్తామని బోర్డు తెలిపింది. అలాగే గతంలో మార్చి 3న నిర్వహిస్తామని ప్రకటించిన 12వ తరగతి లీగల్ స్టడీస్ పరీక్షను ఏప్రిల్ 10న నిర్వహిస్తారు. మిగతా పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులూ లేవు. తాజాగా సవరించిన పరీక్షల తేదీల్ని అడ్మిట్ కార్డుల్లోనూ సవరించి ఇస్తారు. ఈ పరీక్షలకు దాదాపు 26 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు, 20 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications