SSC Exam Update: హాల్ టికెట్ల రిలీజ్ అప్పుడే-తప్పుల సవరణకూ ఛాన్స్..!
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి విద్యార్ధులకు మరో గుడ్ న్యూస్. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు (SSC Exams) రాయబోతున్న విద్యార్దులకు హాల్ టికెట్ల విడుదలతో పాటు దరఖాస్తుల్లో తప్పుల సవరణపై విద్యాశాఖ ఇవాళ స్పష్టత ఇచ్చింది. దీంతో హాల్ టికెట్ల కోసం ఎదురుచూస్తున్నవారితో పాటు పేర్లు, ఇతర తప్పుల సవరణపైనా వారికి ఓ క్లారిటీ వచ్చినట్లయింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్ష విభాగం డైరెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు మార్చి మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కేవీ శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. వీటిని విద్యాశాఖ వెబ్ సైట్ తో పాటు లీప్ యాప్, మన మిత్ర వాట్సాప్ నంబర్ లోనూ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం హాల్ టికెట్లను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశాక వీటిలో ఏదో ఒక విధానంలో వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

అలాగే పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీ లాంటి తప్పులు ఉంటే.. వాటిని వచ్చే నెలలో సవరణకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. కాబట్టి వీటిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అలాగే మార్కుల మెమోలు జారీ చేసే వరకు విద్యార్థుల వివరాలను సరిచేసేందుకు అవకాశం కల్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయా తప్పులు చేసిన వారికి ఊరట దక్కినట్లయింది.












Click it and Unblock the Notifications