TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్దం..!
తెలంగాణలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడంతో తుదుపరి ప్రక్రియలను వేగంగా పూర్తి చేస్తున్నారు.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదల కాగానే అభ్యర్ధులు వాటిని ఎలా చెక్ చేసుకోవాలన్న దానిపైనా అధికారులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించారు. వీటికి రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా విద్యార్దులు హాజరయ్యారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎన్నికల దృష్ట్యా పరీక్షా ఫలితాలను త్వరగానే విడుదల చేయాలని భావించారు. దీంతో పరీక్షలు పూర్తి కాకముందే మార్చి 10నే అప్పటికే పూర్తయిన పరీక్షా పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభించారు.
ఏప్రిల్ 10న ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తిచేశారు. అనంతరం పునఃపరిశీలన చేపట్టారు. అది కూడా పూర్తి కావడంతో ఆన్ లైన్ లో మార్కుల నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పుడు ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఇంటర్ ఫలితాల విడుదల కోసం ఈసీ అనుమతి కూడా కోరారు. ఈసీ నుంచి అనుమతి రాగానే వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 22న ఫలితాల విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు. సోమవారం ఏదైనా కారణాలతో సాధ్యం కాకపోతే మాత్రం మంగళవారం రిలీజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు.
ఇంటర్ ఫలితాలు అధికారికంగా విడుదల కాగానే వాటిని అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల కోసం అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in లోకి వెళ్లి తెలంగాణ ఇంటర్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఫస్టియరా లేక సెకండియరా అనేది ఎంచుకోవాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేస్తే స్కోరు కార్డు ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications