పవన్ కళ్యాణ్‌తో అనసూయ అదిరిపోయే స్టెప్పులు.. సాంగ్ ప్రోమో రిలీజ్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పాలిటిక్స్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొదట్లో ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
మార్చి 28న ఈ సినిమా పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. దీంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఇటీవలే పవన్ కళ్యాణ్ పాడిన 'మాట వినాలి' అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ 'కొల్లగొట్టిందిరో' అని సాగే లిరికల్ సాంగ్ ను ఈ నెల 24న మూడు గంటలకు విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ తో ఉన్న స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతే కాకుండా సాంగ్ ప్రోమోని సైతం రిలీజ్ చేసి డబుల్ బొనాంజా ఇచ్చారు. 'కొరకొర మీసాలతో కొదమ కొదమ అడుగులతో' అంటూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సాగే ఈ గీతం అందరినీ అలరించేలా ఉంది. ఇక ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ గా అనసూయ, పూజిత పొన్నాడ మారారు. ఈ బ్యూటీలు ఇద్దరు పవన్ తో కలిసి స్టెప్పులు వేస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు మంగ్లీ, రమ్య బెహర, యామిని ఘంటసాల, రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటకు.. ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications