మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ నేపథ్యంలో.. ఓపెన్ అయిన బాస్.. !!
ఈ సంక్రాంతికి విడుదల అయిన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ "మన శంకరవరప్రసాద్ గారు" బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విక్టరీ వెంకటేష్ కామియో రోల్ చేశారిందులో. అనిల్ రావిపూడి మార్క్ దర్శకత్వం ప్రేక్షకులను రిపీటెడ్ గా థియేటర్లకు రప్పించుకుంటోంది. ఈ సంక్రాంతికి విడుదల అయిన అన్ని సినిమాలను వెనక్కి నెట్టేసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. రెండో వారంలో కూడా వసూళ్లు తగ్గట్లేదు. దాదాపుగా అన్ని సెంటర్ల నుంచీ భారీగా కలెక్షన్లను రాబట్టుకుంటోందీ మూవీ.
ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్నారు చిరంజీవి. ఈ క్రమంలో- తెలుగు ప్రేక్షకులకు బహిరంగ లేఖ రాశారు. ఈ స్థాయిలో సినిమాను హిట్ చేసినందుకు కృతజ్ఞత తెలిపారు. మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే తన మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోందని అన్నారు. "నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే - నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడి ఉంది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు.." అని చెప్పారు.

"ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది. ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది. వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి.." అని చిరంజీవి పేర్కొన్నారు.
"రికార్డులు వస్తుంటాయి, పోతుంటాయి కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్ బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషీన్ అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెలకు ధన్యవాదాలు., అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు.." అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ లేఖను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications