సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా?
ఉగాది సందర్భంగా రెండు భారీ సినిమాలు థియేటర్లలో విడుదల కావడంతో సినీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒకే సమయంలో రెండు భారీ చిత్రాలు ప్రేక్షకులను పలకరించడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం వార్ జోన్ నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ పవర్ "ఉస్తాద్ భగత్ సింగ్" ఒకటి కాగా.. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'దురంధర్-2' కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలు, యంగ్ హీరోలు, ప్రముఖులు 'దురంధర్-2' గురించి సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దురంధర్-2 గురించి పోస్టులు పెట్టిన వారు "ఉస్తాద్ భగత్ సింగ్"ను విస్మరించడం గమనార్హం.
దురంధర్ మేనియా.. తెలుగు హీరోల ప్రశంసలు
రణవీర్ సింగ్ యాక్టింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్‌కు ఫిదా అయిన పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలు 'దురంధర్-2' చిత్తాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచాయని.. హాలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రం ఉందంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా టెర్రరిజం నేపథ్యం, పాక్ నేపథ్యంలో సాగే సీన్లు ఆకట్టుకోవడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

ఉస్తాద్ భగత్ సింగ్‌ను విస్మరించారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లిపోతుంది. కానీ ఈ సారి "ఉస్తాద్ భగత్ సింగ్" విషయంలో సినీ ఇండస్ట్రీ నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం రావడం లేదని కొందరు అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం నేపథ్యంలో ఇతర హీరోలు వివాదాలకు దూరంగా ఉండాలని భావించడం వల్లే ఈ మౌనమా.. అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 'దురంధర్-2' గ్లోబల్ కంటెంట్ తో ఉండటం వల్ల దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
ఫ్యాన్ వార్ షురూ..
టాలీవుడ్ సినిమాను పక్కన పెట్టి.. పక్క ఇండస్ట్రీ చిత్రాన్ని పొగుడుతున్నారంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. "ఉస్తాద్ అంటే మాస్ బొమ్మ.. ఇది థియేటర్లో చూస్తేనే తెలుస్తుంది" అంటూ తమ అభిమాన నటుడికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం, "మంచి సినిమా ఎక్కడున్నా అభినందించడం తప్పేం కాదు" అని సర్దిచెబుతున్నారు.












Click it and Unblock the Notifications