ఊహించని మలుపులు.. అదరగొట్టిన మర్డర్ మిస్టరీ!
సంగీత దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచె టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'గేదెల రాజు'. చైతన్య మోటూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మర్డర్ మిస్టరీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
కథ
కాకినాడలో పేరుమోసిన రౌడీ షీటర్ గేదెల రాజు (రఘు కుంచె). కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనే బలమైన కోరికతో ఉంటాడు. స్థానిక ఎమ్మెల్యే మద్దతు కూడా రాజుకే లభిస్తుంది. అయితే అదే పార్టీకి చెందిన దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్) కూడా టికెట్ ఆశిస్తాడు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక రాత్రి గేదెల రాజు దారుణంగా హత్యకు గురవుతాడు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అనుమానితులుగా ఉన్న దుర్గను, రాజు సోదరుడు శ్యాంబాబును విచారించినా ఫలితం ఉండదు. మరి ఈ హత్య వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? రిచ్-మీరా, విజయ్-సత్య జంటలకు ఈ హత్యతో ఉన్న సంబంధం ఏంటి? చివరకు పోలీసులు హంతకులను ఎలా పట్టుకున్నారు? అనేదే ఈ చిత్ర కథ.

ఎలా ఉందంటే?
దర్శకుడు చైతన్య మోటూరి ఎంచుకున్న నాన్-లీనియర్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమా ప్రారంభమే హత్యతో మొదలై, ప్రేక్షకుల మెదడుకు పని పెడుతుంది. ప్రతి పాత్రను ప్రవేశపెట్టే తీరు, వారి వెనుక ఉన్న రహస్యాలు ఈ చిత్రంపై క్యూరియాసిటీని పెంచుతాయి. ఇంటర్వెల్ వద్ద వచ్చే చిన్న ట్విస్ట్ సెకండాఫ్ పై ఆసక్తిని కలిగిస్తుంది. ద్వితీయార్థంలో కథ వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా మహాభారతంలోని 'కనిక నీతి' కథను ప్రస్తుత కాలానికి, ఈ సినిమా ప్లాట్‌కు ముడిపెట్టిన విధానం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ముగింపులో వచ్చే ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉండి, థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తుంది.
నటీనటుల పనితీరు
గేదెల రాజు పాత్రలో రఘు కుంచె ఒదిగిపోయాడు. రౌడీ షీటర్‌కు ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్, ఆ కోపం, గోదావరి యాసను ఆయన పలికించిన తీరు అద్భుతం. రిచ్‌గా వికాస్, విజయ్‌గా రామచంద్రం, సత్యగా టీనా శ్రావ్య, మౌనిక తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. శివయ్య పాత్రలో రవి ఆనంద్ నటన ఆకట్టుకుంటుంది.
సాంకేతిక నిపుణులు
రఘు కుంచె అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. చైతన్య మోటూరి ఓ పక్కా క్రైమ్ థ్రిల్లర్‌ను ఆసక్తికరమైన మలుపులతో తెరకెక్కించడంలో విజయం సాధించాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్లు
ఈ సినిమాలో రఘు కుంచె యాక్టింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా నాన్-లీనియర్ స్క్రీన్ ప్లేతో పాటు క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రఘు కుంచె అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అతిపెద్ద ప్లస్ పాయింట్.
మైనస్ పాయింట్లు
ఈ సినిమాలో అక్కడక్కడా కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలను గుర్తుకు తెస్తాయి
చివరి మాట
మర్డర్ మిస్టరీలను, సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు 'గేదెల రాజు' ఒక మంచి ఆప్షన్. ఊహించని మలుపులతో సాగే ఈ చిత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది.
*రేటింగ్: 2.75/5












Click it and Unblock the Notifications