తెలుగు హీరోలంతా తెర వెనక అంతే: శ్రీలీల
శ్రీలీల టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలో ఒక్కసారిగా ఆమెను ఫ్లాప్ సినిమాలు చుట్టుముట్టాయి. వరుసబెట్టి పరాజయాలు పలకరించడంతో కొద్దిరోజులు సినిమాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావించిన ఈ ముద్దుగుమ్మ సినిమాలకు విరామం ప్రకటించింది. ఆమె చేతిలో ప్రస్తుతం పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక్కటే ఉంది. గుంటూరు కారం, ఆదికేశవ, స్కంద, ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ లాంటివన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబినేషనల్ చేయాల్సిన సినిమా నుంచి కూడా తప్పుకుంది.
పవన్ కల్యాణ్ ఎన్నికల వల్ల బిజీగా ఉండటంతో ఉస్తాద్ షూటింగ్ వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ స్టార్ హీరోల కష్టం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చాలామంది హీరోలు శ్రీలీలతో డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టమని అంటున్నారంటూ ఆ విషయాన్ని యాంకర్ శ్రీలీల దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ఆమె బదులిస్తూ డ్యాన్స్ కన్నా తెలుగు హీరోలు యాక్షన్స్ సీన్స్ లో ఎక్కువగా కష్టపడుతుంటారని, వాళ్లు చేస్తున్న యాక్షన్ సన్నివేశాలను చూస్తుంటే మతిపోతుంటుందన్నారు.

వీటితో పోల్చుకుంటే డ్యాన్స్ అనేది చిన్న విషయం అన్నారు. తెలుగు హీరోలు సినిమాల కోసం, అందులో యాక్షన్ సన్నివేశాల కోసం విపరీతంగా కష్టపడుతుంటారంటూ తెరవెనక హీరోల గురించి శ్రీలీల చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సంచలన హీరోయిన్ ఎవరంటే శ్రీలీల అని చెప్పొచ్చు. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి అతి తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. పెళ్లిసందడి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. రవితేజతో కలిసి ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.












Click it and Unblock the Notifications