ఈ ఫోటోలో మొత్తం ఎంత మంది ముఖాలు ఉన్నాయో గుర్తించారా..?
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకే చిత్రాన్ని వేర్వేరు కోణాల్లో చూసినప్పుడు వేర్వేరు రూపాల్లో కనిపించే దృశ్య భ్రమను ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. మన కళ్లకు కనిపించే దృశ్యాన్ని మెదడు వేరే విధంగా అర్థం చేసుకోవడం వల్ల ఈ భ్రమలు ఏర్పడతాయి. అందుకే ఇలాంటి చిత్రాలు కేవలం వినోదం మాత్రమే కాకుండా మన పరిశీలనా శక్తి, ఏకాగ్రత.. మేధస్సును పరీక్షించే ఆసక్తికరమైన పజిల్స్‌లా మారాయి.
ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో ప్రధానంగా భౌతిక భ్రమలు, శారీరక భ్రమలు, అభిజ్ఞా భ్రమలు అనే మూడు రకాలుంటాయి. రంగులు, కాంతి, నీడలు, ఆకారాలు, నమూనాలను ప్రత్యేకంగా కలిపి రూపొందించినప్పుడు మన మెదడు అసలు దృశ్యాన్ని సరిగ్గా గుర్తించలేక భ్రమకు గురవుతుంది. అందుకే మానసిక శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి చిత్రాలను అధ్యయనం చేస్తూ మన మెదడు ఎలా స్పందిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో ఒకటి "ది ఫారెస్ట్ హాస్ ఐస్". ఈ చిత్రాన్ని ప్రముఖ కళాకారిణి బెవ్ డూలిటిల్ రూపొందించారు. మొదట చూసినప్పుడు ఇది ఒక సాధారణ అడవి దృశ్యంలా కనిపిస్తుంది. కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో మొత్తం 13 మంది వ్యక్తుల ముఖాలు చాకచక్యంగా దాచబడ్డాయని తెలుస్తుంది. ఈ దాగి ఉన్న ముఖాలను గుర్తించడం ఈ పజిల్‌లో ప్రధాన సవాలు.
ఈ చిత్రంలో చెట్లు, రాళ్లు, ఆకులు, నీడల ఆకారాల్లో ముఖాలను కలిపి చిత్రాన్ని రూపొందించారు. అడవిలో ప్రయాణిస్తున్న ఒక యాత్రికుడిని చుట్టూ ఉన్న వ్యక్తులు గమనిస్తున్నట్లుగా ఈ దృశ్యాన్ని రూపొందించారు. మొదట చూసినప్పుడు ఇవి సాధారణ ఆకారాల్లా కనిపించినా, కొంచెం దృష్టి పెట్టి పరిశీలిస్తే ఒక్కొక్కటిగా ముఖాలు బయటపడతాయి.
ఈ చిత్రంలో మీరు గుర్తించిన ముఖాల సంఖ్య ఆధారంగా మీ పరిశీలనా శక్తిని అంచనా వేయవచ్చు. పదికి పైగా ముఖాలను గుర్తించగలిగితే మీ మెదడు అత్యుత్తమ స్థితిలో ఉందని భావిస్తారు. ఏడు నుంచి తొమ్మిది ముఖాలను కనిపెట్టగలిగితే మీ పరిశీలనా శక్తి మంచి స్థాయిలో ఉందని చెప్పవచ్చు. నాలుగు లేదా ఐదు ముఖాలు మాత్రమే కనిపిస్తే మరింత ఏకాగ్రత అవసరమని సూచిస్తుంది.
అయితే ఈ చిత్రంలోని చివరి మూడు ముఖాలను గుర్తించడం చాలా కష్టం. అవి చెట్ల ఆకారాలు లేదా ఇతర వస్తువులతో కలిసిపోయి ఉండటం వల్ల వెంటనే కనిపించవు. చాలా మంది మొదటి కొన్ని ముఖాలను సులభంగా గుర్తించినా చివరి వాటిని కనుగొనడంలో కాస్త ఇబ్బంది పడుతుంటారు.
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన మెదడుకు మంచి వ్యాయామంలా పనిచేస్తాయి. ఇవి పరిశీలనా శక్తిని పెంచడమే కాకుండా సమస్యలను విశ్లేషించే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అయితే ఇలాంటి పజిల్స్ ద్వారా అంచనా వేసే IQ పూర్తిగా ఖచ్చితమైనది కాదు. నిజమైన మేధస్సు స్థాయిని తెలుసుకోవాలంటే ప్రామాణికమైన ఐక్యూ పరీక్షలు అవసరం. అయినప్పటికీ, ఇలాంటి చిత్రాలు మన మెదడు పనితీరును అర్థం చేసుకోవడానికి సరదాగా ఉపయోగపడతాయి.












Click it and Unblock the Notifications